పెషావర్: పాకిస్తాన్ ప్రభుత్వం ఆఫ్ఘన్ శరణార్థులపై ఉక్కుపాదం మోపింది. గత నాలుగు దశాబ్దాలుగా ఆఫ్ఘన్ శరణార్థులకు ఆశ్రయమిస్తున్న 42 శరణార్థి శిబిరాలను మూసివేస్తున్నట్లు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ అధికారికంగా ప్రకటించింది. 1979లో సోవియట్ యూనియన్.. ఆఫ్ఘనిస్తాన్‌పై దాడి చేసిన దరిమిలా లక్షలాది మంది శరణార్థులు పాకిస్తాన్‌కు వలస వచ్చారు. సరిహద్దు ప్రాంతమైన ఖైబర్ పఖ్తుంఖ్వా దశాబ్దాలుగా ఈ వలసదారులకు ప్రధాన ఆశ్రయ కేంద్రంగా ఉంటూ వస్తోంది.
దాదాపు 45 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ శిబిరాలను మూసివేయడం వెనుక నిర్దిష్టమైన లక్ష్యాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ప్రావిన్స్‌లో శరణార్థుల నివాస వ్యవస్థను, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిస్థాయిలో క్రమబద్ధీకరించడమే ఈ నిర్ణయంలోని ప్రధాన ఉద్దేశ్యం. ఈ క్రమంలో చట్టవిరుద్ధంగా, ఎటువంటి పత్రాలు లేకుండా నివసిస్తున్న వారిని గుర్తించి, శిబిరాల నుండి తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
శిబిరాల మూసివేత ప్రక్రియను ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా రెండు దశల్లో నిర్వహించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. మొదటి దశలో భాగంగా వలసదారుల వివరాలను సేకరించి, రెండో దశలో శిబిరాల ఖాళీ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే, దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్న వారికి ఈ హఠాత్ నిర్ణయం పెను సవాలుగా మారింది. క్రమబద్ధీకరణ పేరుతో తీసుకున్న ఈ చర్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి.
మరోవైపు ఈ నిర్ణయం పట్ల అంతర్జాతీయ సహాయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. శిబిరాల మూసివేత కారణంగా నిరాశ్రయులైన వారికి తక్షణ సహాయం అందించాల్సిన అవసరం ఉందని ఈ సంస్థలు పేర్కొంటున్నాయి. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను గమనిస్తే, శరణార్థుల పునరావాసం, కనీస అవసరాల విషయంలో తక్షణ చర్యలు తీసుకోకపోతే మానవతా సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని పలు స్వచ్ఛంద సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: ఇంటింటికీ చౌక అణు విద్యుత్.. భద్రత గాలికి?


