న్యూఢిల్లీ: భారత్‌లో ఇంధన రంగం ఒక చారిత్రాత్మక మలుపు తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘శాంతి బిల్లు-2025’ దేశంలో సరికొత్త అణు విప్లవానికి నాంది పలకనుంది. ఇప్పటివరకు కేవలం ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌పీసీఐఎల్ గుత్తాధిపత్యంలో ఉన్న అణు విద్యుత్ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని, విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. ఫలితంగా గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అతి తక్కువ ధరకే లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది.
ఇంధన స్వయం సమృద్ధి దిశగా..
ఈ బిల్లు ద్వారా అణు విద్యుత్ ఉత్పత్తి, మైనింగ్, సాంకేతిక రంగాల్లో ప్రైవేట్ భాగస్వామ్యం పెరుగుతుంది. మార్కెట్‌లో పోటీ పెరగడం వల్ల విద్యుత్ ఛార్జీలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం బొగ్గు, దిగుమతి చేసుకున్న చమురుపై ఆధారపడుతున్న భారత్, ఈ మార్పుతో ఇంధన స్వయం సమృద్ధిని సాధించనుంది. అలాగే సగటు పౌరుని నెలవారీ విద్యుత్ ఖర్చులను తగ్గించాలని చూస్తోంది.
చిన్నపాటి నిర్లక్ష్యంతో భారీ ప్రమాదం
అయితే ఈ సంస్కరణలపై నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాభాపేక్షతో పని చేసే ప్రైవేట్ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే క్రమంలో భద్రతా ప్రమాణాలను విస్మరించే ప్రమాదం ఉందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. అణు రంగం అత్యంత సున్నితమైనది కనుక చిన్నపాటి నిర్లక్ష్యం కూడా భారీ ప్రాణ, ఆస్తి నష్టానికి దారితీస్తుందని వాచ్‌డాగ్ సంస్థలు గుర్తు చేస్తున్నాయి. టారిఫ్ పోటీ అనేదానికి రియాక్టర్ల భద్రతను పణంగా పెట్టకూడదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో..
భద్రతా ఆందోళనలను పరిష్కరించడానికి, ప్రభుత్వం ‘స్వతంత్ర అణు శక్తి నియంత్రణ సంస్థ’ (Independent Nuclear Safety Authority) ఏర్పాటు చేయనుంది. ఈ సంస్థకు లైసెన్స్‌ల జారీ, నియంత్రణ, నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకునే పూర్తి అధికారాలు ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగితే పూర్తి జవాబుదారీతనం ఉండేలా బాధ్యత, నిబంధనలను కూడా ప్రభుత్వం బలోపేతం చేసింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా దీని అమలు పటిష్టంగా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
అత్యధికంగా ఫ్రాన్స్
ప్రపంచవ్యాప్తంగా చూస్తే, ఫ్రాన్స్ తన విద్యుత్ అవసరాలలో 70% పైగా అణుశక్తి నుండే పొందుతోంది. అక్కడ ప్రభుత్వ నియంత్రణ బలంగా ఉంది. అమెరికాలో ప్రైవేట్ భాగస్వామ్యం ఎక్కువగా ఉన్నప్పటికీ, NRC (Nuclear Regulatory Commission) వంటి సంస్థలు కఠినమైన పర్యవేక్షణను కొనసాగిస్తున్నాయి. మరోవైపు జపాన్ తమ దేశంలో చోటుచేసుకున్న ఫుకుషిమా ప్రమాదం తర్వాత మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. భారత్ ఇప్పుడు ఆయా దేశాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, అటు చౌకైన విద్యుత్తును, ఇటు అత్యున్నత భద్రతను సమతుల్యం చేయాల్సిన అవసరం ఉంది.
అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణ
ప్రపంచ అణుకార్యక్రమం ప్రకారం అణు ఇంధనాన్ని శాంతియుత అవసరాలైన విద్యుత్ ఉత్పత్తి, వైద్యం పరిశ్రమల కోసం ఉపయోగించాలి. దీనిని ప్రధానంగా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) పర్యవేక్షిస్తుంది. ఈ క్రమంలో 1970లో అమల్లోకి వచ్చిన అణువ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ) అత్యంత కీలకమైనది. ఇది అణు సాంకేతికతను శాంతియుత ప్రయోజనాల కోసం పంచుకోవడం అనే లక్ష్యంతో పనిచేస్తుంది. వీటితో పాటు అణ్వాయుధ పరీక్షలను నిషేధించే సీటీబీటీ, అణు సామగ్రి రక్షణ కోసం కుదుర్చుకున్న వివిధ ద్వైపాక్షిక ఒప్పందాలు ప్రపంచ భద్రతను కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: తాజ్ మహల్ మాయం.. పర్యాటకుల ఆశ్చర్యం


