ఛత్తీస్‌గఢ్: సుక్మా జిల్లాలో మరోసారి తుపాకుల మోత మోగింది. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఒక మహిళ ఉన్నారు. మరికొందరు మావోయిస్టులు గాయపడినట్టు సమాచారం. భద్రతాదళాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. గొల్లపల్లి అటవీప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రతాదళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో డిసెంబర్ 3వ తేదీన పోలీస్ బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరగ్గా, 12 మంది మావోయిస్టులు, ముగ్గురు డీఆర్‌జీ జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, కోబ్రా, సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ కొనసాగుతోంది. తాజా ఎన్‌కౌంటర్‌తో కలిపి ఈ ఏడాది ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో 278 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్, దంతెవాడ సహా ఏడు జిల్లాలతో కూడిన ఒక్క బస్తర్ డివిజన్‌లోనే 246 మంది మరణించారు.
మరోవైపు, మావోయిస్టులు లొంగిబాట పడుతున్నారు. గత వారంలో మరో 10 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సుక్మా పోలీసుల ఎదుట లొంగిపోయిన వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. మావోయిస్టులపై రూ.33 లక్షల చొప్పున రివార్డ్ ఉంది. ఈ ఏడాది జిల్లాలో మొత్తం 263 మంది మావోయిస్టులు హింసను విడిచిపెట్టారని పోలీసు అధికారులు తెలిపారు. పూనా మార్గెం పునరావాస, సామాజిక సమ్మిళితం కార్యక్రమంలో భాగంగా మావోయిస్టులు లొంగిపోయారని అధికారులు వెల్లడించారు.
ఈ నెల డిసెంబర్ 8న ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో గల ఖైరాగఢ్ ప్రాంతంలో పలువురు మావోయిస్టులు తమ ఆయుధాలతో సహా పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఎంఎంసీ(మధ్యప్రదేశ్-మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్) జోన్‌లో చురుకుగా పనిచేసిన మావోయిస్టు కమాండర్ రామ్‌ధేర్ మజ్జీ తన 12 మంది సహచరులతో సహా పోలీసుల సమక్షంలో లొంగిపోయాడు.


