న్యూఢిల్లీ: నివారణ చర్యలు చేపట్టినా కూడా రాజధానిలో వాయు కాలుష్యం తగ్గడం లేదు. ఢిల్లీలోని అనేక ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసి, దృశ్యమానత గణనీయంగా తగ్గిపోయింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం గురువారం ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక (AQI) 358 వద్ద నమోదైంది.
ప్రస్తుత ఏక్యూఐ చాలా పేలవమైన విభాగంలోకి వస్తుంది. ఢిల్లీలోని 39 మానిటరింగ్ స్టేషన్లలో నాలుగు తీవ్రమైన కేటగిరీలో AQI నమోదు కాగా, మరికొన్ని ఇంకా కింద ఉన్నాయి. బుధవారం 24 గంటల సగటు AQI 334గా నమోదైంది. NCRలోని నోయిడా (331), గ్రేటర్ నోయిడా (310), గురుగ్రామ్ (279)లో కూడా గాలి నాణ్యత దారుణంగా ఉంది.
భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. ఉదయం వేళల్లో వాయువ్య దిశ నుండి గంటకు 10 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మధ్యాహ్నం వేళల్లో గాలి వేగం 15 కి.మీ వరకు పెరుగుతుంది. సాయంత్రం, రాత్రి సమయంలో పశ్చిమ దిశ నుండి 10 కి.మీ కంటే తక్కువకు పడిపోతుంది. ఈ గాలి మార్పులు పొగమంచును వెదజల్లడంలో సహాయపడతాయి. రాబోయే రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలో పెద్ద మార్పు ఉండదు, తరువాతి రోజుల్లో 2 డిగ్రీల సెల్సియస్ పెరుగుతుందని IMD అంచనా వేసింది.

రాకపోకలకు అంతరాయమే..
ఢిల్లీ విమానాశ్రయం తక్కువ విజిబిలిటీ కారణంగా ప్రయాణికులను అప్రమత్తం చేస్తూ హెచ్చరిక జారీ చేసింది. విమాన కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నప్పటికీ, ప్రయాణికులు తమ విమాన స్థితిని సంబంధిత ఎయిర్‌లైన్స్ ద్వారా తెలుసుకోవాలని సూచించారు. ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్ కూడా ప్రయాణికులకు సలహాలు జారీ చేశాయి. తాజా నిబంధనలతో గుర్‌గావ్, ఘజియాబాద్, ఫరీదాబాద్, నోయిడా నుంచి ఎంటర్ అయ్యే 12 లక్షల వాహనాలపై ప్రభావం పడనుంది. ఈ వాహనాల తనిఖీ కోసం 126 చెక్ పాయింట్ల వద్ద 580 మంది పోలీసుల మోహరించారు. పెట్రోల్ బంకుల వద్ద ట్రాన్స్పోర్ట్, ఎం సి డి ,ఫుడ్ డిపార్ట్మెంట్ అధికారుల మోహరించారు. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు.
ఆ వాహనాలకు ఇంధన సరఫరా నిలిపివేత
ఈ నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం పలు కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టింది గ్రాప్ IV కింద అత్యంత కఠినమైన కాలుష్య నియంత్రణలు అమల్లోకి వచ్చాయి. గ్రాఫ్ ఫోర్ నిబంధనల నేపథ్యంలో ఒకటి నుంచి ఐదో తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. మిగిలిన తరగతులకు హైబ్రిడ్ మోడ్ క్లాసులు జరగనున్నాయి. పీయూసీసీ (Pollution Under Control Certificate) లేని వాహనాలకు ఇంధన సరఫరా నిలిపివేయబడుతుంది. BS-VI నిబంధనల కంటే తక్కువ ఉన్న ఢిల్లీయేతర వాహనాలు రాజధానిలోకి ప్రవేశించకుండా నిరోధించబడ్డాయి.
పార్లమెంట్‌లో నేడు చర్చ
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పొగమంచు, వాయు కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో AQI చాలా దారుణమైన స్థాయికి పడిపోతుందని ఓ అంచనా. ఢిల్లీ వాయు కాలుష్యంపై నేడు లోక్ సభలో చర్చ జరగనుంది. విపక్షాల నుండి చర్చ ప్రారంభించనున్న ప్రియాంకా గాంధీ, డింపుల్ యాదవ్. బీజేపి తరపున చర్చలో నిషికాంత్ దూబే, బన్సూరీ స్వరాజ్ పాల్గొననున్నారు.


