దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో వాయుకాలుష్యం భూతం వేయి కాళ్లతో విస్తరిస్తోంది. రోజురోజుకూ పెనుభూతంలా మారుతున్న కాలుష్యం కారణంగా వాయు నాణ్యత రికార్డ్ స్థాయిల్లో క్షీణిస్తోంది. డబ్ల్యూహెచ్వో నివేదిక కంటే 18 రెట్లు ఎక్కువగా ఢిల్లీలోని సూక్ష్మ కణిక పదార్థం (PM2.5) 2.5 గా ఉందని అంచనా. ఫలితంగా ఢిల్లీలో రోగాలతో ఆస్పత్తుల్లో చేరుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముసురుకుంటున్న కాలుష్య మేఘాల కారణంగా అనే రోడ్డు ప్రమాదాలు, ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా నమోదవుతున్నాయి.
తీవ్రమైన దగ్గు, ఊపిరాడకపోవడం, ఊపిరితిత్తుల పనితీరు బలహీనం కావడం ఇలాంటి సమస్యలతో పాటు,అకాల మరణాలకు దారితీస్తుంది. ఢిల్లీ కాలుష్యంతో లంగ్ క్యాన్సర్ ముప్పు ఉందని శాస్త్రీయ పరిశోధనలలో వెల్లడైంది. పీఎం 2.5, నైట్రోజన్ డయాక్సైడ్ నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరడంతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పీఎం 2.5 పెరుగుదలతో లంగ్ క్యాన్సర్ ముప్పు 14శాతం పెరుగుతుందని డబ్ల్యుహెచ్‌వో నివేదిక ద్వారా తెలుస్తోంది. ఎక్కువసేపు బయట పని ప్రదేశంలో ఉంటున్న యువతీ యువకులపై ఇది మరింత తీవ్ర ప్రభావం చూపుతోంది.
వాయు కాలుష్యం ఆరోగ్యం పై ప్రభావం
వాయు కాలుష్యానికి స్వల్ప మరియు దీర్ఘకాలికంగా గురికావడం వల్ల స్ట్రోక్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, ట్రాకియా, బ్రోంకస్ ,ఊపిరితిత్తుల క్యాన్సర్‌లు, తీవ్ర ఆస్తమా ,దిగువ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు లాంటి పలు వ్యాదులు వస్తాయి. వాయు కాలుష్యానికి గురికావడంవల్ల టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం, దైహిక వాపు, అల్జీమర్స్ వ్యాధి , చిత్తవైకల్యానికి దారి తీయవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తేల్చింది. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ వాయు కాలుష్యాన్ని, ముఖ్యంగా PM2.5ని క్యాన్సర్‌కు ప్రధాన కారణంగా వర్గీకరించింది. దీర్ఘకాలికంగా ఈ కాలుష్యం బారిన పడితే శరీరంలోని ప్రతి అవయవాన్ని ప్రభావితం చేస్తుందని, ఇది ఇప్పటికే ఉన్న అనారోగ్య పరిస్థితులనుమరింత తీవ్రతరం చేస్తుందని మరొక ప్రపంచ సమీక్ష కనుగొంది.
ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న దశలో ఉన్న పిల్లలు,కౌమారదశలో ఉన్న వారిపై మరింత హానికరమైన ప్రభావం ఉటుంది. వాయు కాలుష్యం బాల్యంలో ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. జీవితంలో తరువాతి కాలంలో వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
EEA లెక్కలు
యూరోపియన్ ఎన్విరాన్‌మెంట్ ఏజెన్సీ (EEA) తాజా అంచనాల ప్రకారం సూక్ష్మ కణ పదార్థం (PM 2.5) ఆరోగ్యానికి గణనీయ మైన ప్రభావాలను కలిగిస్తూనే ఉంది.2021లో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వాయు కాలుష్యం మానవ ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుందో చూపించే తాజా శాస్త్రీయ ఆధారాలను క్రమబద్ధంగా సమీక్షించిన తర్వాత కొత్త గాలి నాణ్యత మార్గదర్శకాలను ప్రచురించింది. దీని ప్రకారం 2050 నాటికి గాలి, నీరు మరియు నేల కాలుష్యాన్ని ఆరోగ్యానికి మరియు సహజ పర్యావరణ వ్యవస్థలకు హానికరం కాని స్థాయికి తగ్గించడానికి ఒక దార్శనికతను నిర్దేశించింది. దీంతోపాటు జీరో పొల్యూషన్ యాక్షన్ ప్లాన్ 2030కి లక్ష్యాలను నిర్దేశించింది.
2005తో పోలిస్తే వాయు కాలుష్యం (అకాల మరణాలు) ఆరోగ్య ప్రభావాలను 55శాతం కంటే ఎక్కువ తగ్గించడం.
2005తో పోలిస్తే జీవవైవిధ్యానికి ముప్పుగా మారుతున్న ఈయూ పర్యావరణ వ్యవస్థల వాటాను 25శాతం తగ్గించడం.
యూరోపియన్ ఎన్విరాన్‌మెంట్ ఏజెన్సీ (EEA) అంచనా ప్రకారం 2023లో, పట్టణ జనాభాలో 94.4శాతం మంది ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ఆరోగ్య ఆధారిత మార్గదర్శక స్థాయి కంటే ఎక్కువ సూక్ష్మ కణాల సాంద్రతలకు గురయ్యారు.27 EU సభ్య దేశాలలో 182,000 అకాల మరణాలు సంభవించాయి.
ముప్పు గుప్పిట్లో హైదరాబాద్
మరోవైపు ఢిల్లీ నగరం మాత్రమే కాదు హైదరాబాద్‌లో కూడా కాలుష్యం తీవ్రంగానే ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌లో వాయుకాలుష్యంతో పాటు, నీటి కాలుష్యం, శబ్ద, ఆహార కాలుష్యం ఇలా పలు రకాలతో కూడిన కాలుష్య భూతం నగరవాసుల పాలిట ప్రమాదకరంగా పరిణమించి ప్రమాద ఘంటికలను మోగిస్తోందని, అప్రమత్తంగా ఉండాలని పర్యావరణ వేత్తలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


