సాక్షి, హైదరాబాద్: శీతాకాల విడిది కోసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు మధ్యాహ్నం హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మూర్మును హకీంపేట ఎయిర్‌పోర్టులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, డీజీపీ శివధర్ రెడ్డి స్వాగతం పలికారు.
భద్రతా ఏర్పాట్లు
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డిసెంబర్ 17 నుంచి 22 వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యంగా హకీంపేట, బోలారం, అల్వాల్, తిరుమలగిరి, కార్కానా ప్రాంతాల్లో వాహనాల డైవర్షన్ ఉండనుంది. కాగా, డిసెంబర్19 ఉదయం 11.00 గంటలకు జరగనున్న ఆల్ ఇండియా పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల జాతీయ సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు.
అంతకు ముందు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి నిలయంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో రాష్ట్రపతి నిలయం పరిసరాల్లో కోతుల బెడదను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలను నియమించాలని, అదేవిధంగా తేనెటీగల సమస్యను పరిష్కరించడానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.


