సాక్షి,హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ డివిజన్ల సంఖ్య పెంపుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ పూర్తైంది. మరికాసేపట్లో న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది.
విచారణ సందర్భంగా పిటిషనర్లు, ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోర్టులో తమ వాదనలు వినిపించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరగా, రాష్ట్ర ప్రభుత్వ తరఫున హైకోర్టులో వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు.
డీలిమిటేషన్‌పై ముందస్తు సమాచారం ఇవ్వలేదని పిటిషనర్లు వాదించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రభాకర్ మాట్లాడుతూ.. డీలిమిటేషన్ మ్యాప్‌ను పబ్లిక్ డొమైన్‌లో ఉంచలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనికి ప్రతిగా పునర్విభజన మ్యాప్‌ను హైకోర్టుకు సమర్పించామని ఏజీ చెప్పారు. నియోజకవర్గాల సరిహద్దులు మార్చకుండా వార్డుల విభజన మాత్రమే జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. మరి కాసేపట్లో తీర్పును వెలువరించనుంది.


