తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసిన హైకోర్టు
సామాన్యుడికో నీతి.. పదవుల్లో ఉన్నవారికో నీతా?
రూ.800 కట్టలేదని మా ఇంటి కనెక్షనే తొలగించారు
ఒక్క నెల బిల్లు చెల్లించకుంటే సామాన్యుడిదీ అదే పరిస్థితి
మరి గీతం యూనివర్సిటీకి ఎందుకీ వెసులుబాటు?... కరెంట్ కనెక్షన్ తొలగించకుండా ఏం చేస్తున్నారు?
విద్యుత్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన జస్టిస్ నగేశ్ భీమపాక
‘నామమాత్రపు బకాయిలున్నా పేద వినియోగదారుల విద్యుత్ కనెక్షన్లను తొలగిస్తారు. తొలగించే ముందు వినియోగదారులకు ఎలాంటి నోటీసు కూడా పంపరు. అలాంటిది రూ.118 కోట్లు బకాయిలున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర ఆశ్చర్యం కలిగిస్తోంది. పదవుల్లో ఉన్న వారి కోసం ఓ చట్టం, పేదవారి కోసం మరో చట్టాన్ని విద్యుత్ అధికారులు రూపొందించారా?’
‘దశాబ్దాలుగా బిల్లు చెల్లించకుండా విద్యుత్ సేవలు పొందుతుండటం దిగ్భ్రాంతికరం. 2008–09 నుంచి బకాయిలు పేరుకుపోయాయి. విశ్వవిద్యాలయానికి విద్యుత్ సరఫరాను వెంటనే నిలిపివేయాలని డిస్కమ్‌ల నుంచి స్పష్టమైన ఉత్తర్వులున్నా.. అధికారులు మాత్రం నోటీసుల జారీకి మాత్రమే పరిమితమయ్యారు. ఇది సంబంధిత అధికారుల నిష్క్రియాత్మకతకు నిదర్శనం’ – జస్టిస్ నగేశ్ భీమపాక
సాక్షి, హైదరాబాద్: దాదాపు రెండు దశాబ్దాలుగా ఓ సంస్థ విద్యుత్ బిల్లు చెనిష్క్రిల్లించకుంటే అధికారులు ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. రూ.118.13 కోట్ల బకాయిలున్న గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (గీతం) యూనివర్సిటీపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సామాన్య ప్రజలకు ఓ నీతి.. ఆర్థికంగా ఉన్నవారికో నీతా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. బాల్యంలో తన ఇంటికి రూ.800 బకాయి ఉంటే అధికారులు సరఫరాను ఎలా నిలిపివేశారో ఈ సందర్భంగా జస్టిస్ నగేశ్ భీమపాక గుర్తు చేసుకున్నారు.
అలాంటి విద్యుత్ అధికారులు గీతం వర్సిటీకి ఎందుకు వెసులుబాటు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. పదవుల్లో ఉన్న వారి కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించారా అని ప్రశ్నించారు. విద్యుత్ కనెక్షన్ తొలగించకుండా మీనమేషాలు లెక్కబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థికంగా, పదవుల్లో ఉన్న వారి కోసం అధికారులు చేపట్టే ఇలాంటి చర్యలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తాయని హెచ్చరించారు.
విశ్వవిద్యాలయానికి విద్యుత్ సరఫరాను ఎందుకు నిలిపివేయలేదో వివరించడానికి తదుపరి విచారణ తేదీన టీజీఎస్పీడీసీఎల్‌లోని ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ స్వయంగా హాజరు కావాలని ఆదేశించారు. తదుపరి విచారణ డిసెంబర్ 22కు వాయిదా వేశారు.
చర్య తీసుకోకపోవడం సరికాదు..
బకాయిలను చెల్లించాలని, లేకపోతే విద్యుత్ సరఫరాను నిలిపేస్తామంటూ గత సెప్టెంబర్ లో సూపరింటెండెంట్ ఇంజనీర్ గీతం వర్సిటీకి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాల్ చేస్తూ సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారంలోని గీతం వర్సిటీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యా యవాది వాదనలు వినిపిస్తూ.. గీతం వర్సిటీకి వి ద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని నోటీసులు జారీ చేయడం అన్యాయమన్నారు.
టీజీఎస్పీడీసీఎల్ స్టాండింగ్ కౌన్సెల్ శ్రీధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. గతంలోనూ గీతం వర్సిటీకి నోటీసులు జారీ చేశామన్నారు. దాన్ని సవాల్ చేస్తూ 2020లో రిట్ పిటిషన్ దాఖలు చేసిందన్నారు. తొలుత వర్సిటీ మ ధ్యంతర స్టే పొందినా.. తర్వాత పిటిషన్‌ను ఉపసంహరించుకుందని చెప్పారు. దీంతో విద్యుత్ బకాయిలు గణనీయంగా పేరుకుపోయాయని చెప్పారు.
మొత్తం రూ.118,13,46,432 బకాయిలున్నాయని, తదనుగుణంగా సూపరింటెండెంట్ ఇంజనీర్ గత సెప్టెంబర్ లో మళ్లీ నోటీసు జారీ చేశారని వెల్లడించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పెద్దఎత్తున, దీర్ఘకాలిక బకాయిలున్నా గీతం వర్సిటీపై ఎటువంటి చర్య తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు.


