మక్తల్ ప్లాంట్‌కు బొగ్గు సరఫరా ఇబ్బంది
పాల్వంచ ప్లాంట్‌కు వ్యయం ఎక్కువ
యూనిట్ కాస్ట్ పెరిగే అవకాశం
విద్యుత్ శాఖకు కన్సల్టెన్సీ నివేదిక
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మూడు థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులపై విద్యుత్ ఉన్నతాధికారులు సమీక్షించారు. ఇందులో రామగుండం థర్మల్ నిర్మాణం సానుకూలంగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు. మక్తల్, పాల్వంచలో థర్మల్ యూనిట్ల ఏర్పాటుపై కొన్ని ఇబ్బందులను గుర్తించారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.
త్వరలో ఇందుకు సంబంధించిన నివేదిక ఇస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. రాష్ట్రంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో రామగుండం, మక్తల్, పాల్వంచలో థర్మల్ యూనిట్ల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రామగుండం ప్లాంట్‌కు సంబంధించి ఇప్పటికే సమగ్ర నివేదికను రూపొందించగా, మక్తల్, పాల్వంచ ప్లాంట్ల సాధ్యాసాధ్యాలపై కన్సల్టెన్సీని నియమించారు. ఇందుకు సంబంధించి కన్సల్టెన్సీ నివేదిక వచ్చింది. దీనిపై అధికారులు సమీక్ష జరిపారు.
మక్తల్‌కు బొగ్గు కష్టం
మక్తల్‌లో థర్మల్ విద్యుత్ ప్లాంట్ సాధ్యమయ్యేట్టు కన్పించడం లేదు. ఇక్కడకు బొగ్గు చేరవేయడం కష్టమని కన్సల్టెన్సీ పేర్కొంది. ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పించాల్సి ఉంటుందని, రోడ్డు మార్గంలో బొగ్గు చేరవేసేందుకూ అనుకూల పరిస్థితులు లేవని తెలిపింది. భూసేకరణ కూడా కష్టమని, ఎక్కువ వ్యయంతో కూడుకున్నదని స్పష్టంచేసింది. ఇక్కడ ధర్మల్ యూనిట్‌కు మెగావాట్‌కు రూ.9–11 కోట్లు అవుతుందని అంచనా వేసింది. దీనివల్ల యూనిట్ విద్యుత్ రూ.10 పైనే ఉంటుందని చెప్పింది.
నిర్మాణ వ్యయానికి చేసే అప్పు, దానిపై వడ్డీ తడిసి మోపెడవుతుందని పేర్కొంది. సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు కూడా అంత సానుకూలమైన పరిస్థితులు మక్తల్‌లో లేవని గుర్తించారు. గ్రామీణ ప్రాంతాలు దగ్గర దగ్గరగా ఉండటం వల్ల, వ్యవసాయ భూమి ఉండటం వల్ల అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని కన్సల్టెన్సీ సంస్థ తెలిపింది.
పాల్వంచ ప్లాంట్ వ్యయం ఎక్కువ...
పాల్వంచలో 800 మెగావాట్ల ధర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు భూమి అందుబాటులోనే ఉంది. అయితే, ఇప్పుడున్న ప్లాంట్ నుంచి వచ్చే బూడిదను కొన్ని దశాబ్దాలుగా నిల్వ ఉంచారు. ప్లాంట్ కన్నా బూడిద ఆక్రమించిన స్థలమే ఎక్కువగా ఉంది. దీన్ని వేరే చోట డంప్ చేయాల్సి ఉంటుంది. దీనికి అదనంగా భూమి కొనుగోలు చేయడం తప్ప మరో మార్గం లేదు. పాల్వంచలో ప్రస్తుతం ఉన్న ప్లాంట్లకు అందుతున్న సింగరేణి బొగ్గు సగటు ఉష్ణశక్తి (జీసీవీ) 3600 మాత్రమే ఉంటుంది.
సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించ తలపెట్టిన థర్మల్ యూనిట్‌కు 4 వేలపైనే జీసీవీ బొగ్గు అవసరమని నిపుణులు భావిస్తున్నారు. విదేశీ బొగ్గు దిగుమతి చేసుకుంటే తప్ప ప్లాంట్‌ను నడపలేమని చెబుతున్నారు. దీనికోసం చేసే వ్యయం మెగావాట్‌కు రూ.10 కోట్లు దాటుతుందని చెబుతున్నారు. దీనివల్ల మార్కెట్లో లభించే విద్యుత్ కన్నా రెండు రెట్లు ధర ఎక్కువగా ఉంటుందని, పీక్ అవర్స్‌లో తప్ప ఈ విద్యుత్‌ను వాడటం సాధ్యం కాదని విద్యుత్ ఉన్నతాధికారులు అంటున్నారు.
సరికొత్త వివాదం
భవిష్యత్ విద్యుత్ డిమాండ్ కోసమే వీటిని ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుండగా, రాబోయే కాలంలో మార్కెట్లో తక్కువ ధరకే విద్యుత్ లభిస్తుందని కేంద్ర విద్యుత్ సంస్థ చెబుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టాలనుకున్న ప్లాంట్లపై సాధ్యాసాధ్యాల నివేదికలు వ్యతిరేకంగా వచ్చాయి. దీంతో నిర్మాణంపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందనేది సందేహాస్పదంగా ఉంది.
అత్యధిక వ్యయంతో చేపడితే విద్యుత్ కొనుగోలుకు డిస్కమ్‌లు ముందుకొచ్చే పరిస్థితి ఉండదు. తరచూ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేస్తే నిర్మాణ వ్యయంపై తెచ్చిన అప్పుపై వడ్డీ పెరుగుతుంది. ఇవన్నీ సరికొత్త వివాదానికి తెరతీస్తాయని విద్యుత్ రంగ నిపుణులు భావిస్తున్నారు.


