ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్
ఓటింగ్ పూర్తయ్యాక కౌంటింగ్
సాక్షి, హైదరాబాద్: తుదివిడత పల్లె పోరుకు సర్వం సిద్ధ మైంది. బుధవారం జరగనున్న మూడోవిడత పంచాయతీ ఎన్నికలతో రాష్ట్రంలో పల్లెపోరు ముగియనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా పోలింగ్ ఉంటుంది. పోలింగ్ ముగియగానే ఏజెంట్ల సమక్షంలో బాక్సులకు సీల్ వేస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులను ప్రకటిస్తారు. అదేరోజు ఉపసర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది.
ఏదైనా కారణం వల్ల వాయిదా పడితే మరుసటిరోజు ఆ ఎన్నికను నిర్వహిస్తారు. మూడో దశ ఎన్నికల్లో భాగంగా.. 3,752 సర్పంచ్ పదవులకు 12,652 మంది, 28,410 వార్డులకు 75,725 మంది (నామినేషన్లు దాఖలు కాని, ఏకగ్రీవమైన స్థానాలు మినహాయించి) పోటీపడుతున్నారు. మంగళవారం పోలింగ్‌కేంద్రాలకు ఎన్నికల సామగ్రి చేరుకుంది. సాయంత్రంకల్లా పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు.
బ్యాలెట్ బాక్సుల నుంచి బందోబస్తు వరకు అన్నీ పక్కాగా ఉండేలా ఆయా జిల్లాల్లో అధికార యంత్రాంగం ’జీరో ఎర్రర్’ విధానాన్ని అనుసరిస్తోంది. మంగళవారం సాయంత్రంకల్లా మొత్తం పోలింగ్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేసినట్టు ఎస్‌ఈసీ వెల్లడించింది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎక్కడ లోపాలు తలెత్తకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీకుముదిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.


