డిమాండ్ ఆధారిత పథకాన్ని సరఫరా ఆధారితంగా మార్చాలనుకోవడం ప్రమాదకరం
కేంద్ర ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉపాధి ప్రణాళికలను రచించాలనుకోవడం రాజ్యాంగ ఉల్లంఘనే
వీబీ–జీ రామ్–జీ బిల్లుపై సామాజికవేత్తలు, నిపుణుల మండిపాటు
సాక్షి, హైదరాబాద్: కేంద్రం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్) (వీబీ–జీ రామ్–జీ) బిల్లు–2025 పై సామాజిక ఉద్యమకారులు, నిపుణులు, మండిపడుతున్నారు. ప్రస్తుత ఉపాధి హామీ పథకం డిమాండ్ ఆధారిత, సార్వత్రికమైనదని.. దీన్ని కాస్తా సరఫరా ఆధారితానికి మార్చాలనుకోవడం ప్రమాదకర మని విమర్శిస్తున్నారు. స్థానికంగా జరగాల్సిన ఉపా ధి ప్రణాళికల రూపకల్పనను కేంద్రం నిర్దేశించిన ప్రాధాన్యతలకు మార్చాలనుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణను ఉల్లంఘిస్తోందని నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే డిజిటల్ హాజరు, ఆధార్ ఆధారిత చెల్లింపులను ప్రవేశపెట్టడం వల్ల ఎందరో కార్మికులు ఉపాధికి దూరమయ్యారని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే కొత్త బిల్లులో ఏకంగా బయోమెట్రిక్ ధ్రువీకరణ, జియో–స్పేషియల్ టెక్నాలజీ వాడకా న్ని తప్పనిసరి చేయాలనుకోవడం కార్మికులపై మరింత నిఘా పెట్టడమేనని విమర్శిస్తున్నారు.
ముఖ్యంగా వ్యవసాయ కూలీలకు బయోమెట్రిక్ విధా నం తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని అనేక నివేదికలు స్పష్టం చేశాయని సామాజిక ఉద్యమకారులు గుర్తుచేస్తున్నారు.
సాధారణ పథకంగా మార్చే కుట్ర
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం స్థానంలో కేంద్రం తేవాలనుకుంటున్న వీబీ–జీ రామ్–జీ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం. చట్టబద్ధ హక్కుల ఆధారిత వ్యవస్థను బడ్జెట్ పరిమితులతో సాధారణ పథకంగా మార్చే కుట్ర జరుగుతోంది. చట్టబద్ధమైన హక్కుల ఆధారిత వ్యవస్థను, కేంద్రానికి ఎలాంటి జవాబుదారీతనం లేని బడ్జెట్ పరిమితులతో కూడిన ఒక సాధారణ పథకంగా మార్చాలనుకోవడాన్ని ఖండిస్తున్నాం.
ఈ బిల్లులోని సెక్షన్ 5 (1) ప్రకారం కేంద్రం ఒకవేళ ఏదైనా ప్రాంతాన్ని గ్రామీణ ప్రాంతంగా నోటిఫై చేయకపోతే ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి హక్కుగా లభించదు. – పి.శంకర్, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి, నరెగ సంఘర్షణ మోర్చా జాతీయ కమిటీ సభ్యుడు
పేరులోనే గ్యారంటీ.. నిజమైన హామీ లేదు
ఉపాధిని హక్కుగా కాకుండా కేంద్ర ప్రభుత్వ విచక్షణపై ఆధారపడే దయగా మార్చాలనుకోవడం ప్రస్తుత ఉపాధి హామీ చట్టం స్వభావం, మౌలిక లక్ష్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. వీబీ–జీ రామ్–జీ అనేది గ్యారంటీ లేని ఒక పథకంగా మారనుంది. పేరులో గ్యారంటీ ఉన్నప్పటికీ ప్రతిపాదిత చట్టంలో నిజమైన హామీ లేదు. ఈ మార్పుల ప్రభావం ఎక్కువగా ఆదివాసీలు, దళితులు, మహిళలపై పడుతుంది.
ఇది కేవలం పరిపాలనా సమస్య కాదు.. ఇది సామాజిక న్యాయానికి సంబంధించిన అంశం. తొలిసారిగా ఒక చట్టంలో సాంకేతికతలను తప్పనిసరిగా భాగం చేసిన పథకం ఇదే. ఈ స్కీమ్ ఎక్కడ అమలవ్వాలి, ఎన్ని నిధులివ్వాలి, ఏయే పనులు చేపట్టాలి వంటి కీలక నిర్ణయాలను కేంద్రం తీసుకొని ఖర్చును మాత్రం రాష్ట్రాలపై మోపాలనుకుంటోంది. – చక్రధర్ బుద్ధ, డైరెక్టర్, లిబ్‌టెక్ ఇండియా
ప్రస్తుత ఉపాధి హామీ చట్టం, ప్రతిపాదిత వీబీ–జీ రామ్–జీ చట్టంలో ప్రధాన తేడాలు..
ఉపాధి హామీ చట్టం...
» ఏడాదిలో 100 రోజులపాటు గ్రామీణులకు ఉపాధి హక్కుగా లభ్యం.
» డిమాండ్ బట్టి నిధులు అనే విధానంతో పథకం అమలు.
» ఏడాది పొడవునా ఉపాధి పనులకు కేంద్రం గ్యారంటీ.
» ప్రజలు డిమాండ్ చేసిన 15 రోజుల్లోగా పని కల్పించకుంటే నిరుద్యోగ భృతి పొందే హక్కు.
» కూలీల వేతనాలు 100% కేంద్రమే భరిస్తుంది. అలాగే 75% మెటీరియల్ ఖర్చును కేంద్రమే భరిస్తుంది.
» 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఉపాధి హామీ పనుల ప్రణాళిక రూపకల్పనపై గ్రామ సభలకే నిర్ణయాధికారం.
ప్రతిపాదిత వీబీ–జీ రామ్–జీ చట్టం...
» ప్రణాళికలు, సిస్టమ్‌లకు సరిపోతేనే ఉపాధి.
» వ్యవసాయ పీక్ సీజన్‌లో 60 రోజులపాటు ఉపాధి పనుల నిలిపివేత.
» కేంద్రం నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగా ప్రతి ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాలవారీగా నిధుల కేటాయింపు.
» కేటాయించిన నిధుల కంటే ఎక్కువ ఖర్చయితే ఆ ఆర్థిక భారం రాష్ట్ర ప్రభుత్వాలదే.
» కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉపాధి నిధుల చెల్లింపు నిష్పత్తి. ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలకు 90:10గా, మిగిలిన రాష్ట్రాలకు 60:40 ఖరారు.
» వికసిత్ భారత్ నేషనల్ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ ద్వారా రాష్ట్రాలకు, పంచాయతీలకు మార్గనిర్దేశం.
» నిధుల పరిమితిలోనే 125 రోజులు ఉపాధి హామీ.


