సీఎం రేవంత్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది..
అందుకే విజయోత్సవాల పేరుతో పరోక్ష ప్రచారం
సాక్షి, హైదరాబాద్: ‘ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఇంకో రెండేళ్లే. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. మీరు ఐదేళ్ల కోసం గెలిచారు, మిగిలిన సగం కాలం మన ప్రభుత్వంలోనే అభివృద్ధి పనులు చేసుకుంటారు. ఖానాపూర్, షాద్‌నగర్ గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయం’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఐకమత్యంతో కలిసి పనిచేయాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం తెలంగాణభవన్‌లో ఖానాపూర్, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల కోసం సీఎం స్వయంగా జిల్లాలు తిరుగుతూ ప్రచారం చేయడం చరిత్రలో ఎన్నడూ లేదని విమర్శించారు. ఎన్టీఆర్, వైఎస్‌ఆర్, కేసీఆర్ వంటి నాయకులు ఏనాడూ సర్పంచ్ ఎన్నికల కోసం రోడ్ల మీద పడలేదన్నారు.
రేవంత్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే విజయోత్సవాల పేరుతో పరోక్ష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధికార మదం తలకెక్కిందని, ప్రజలు, ప్రజాప్రతినిధులను చంపేస్తామంటూ బరి తెగించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
బెదిరింపులకు సర్పంచ్‌లు లొంగొద్దు
ఎవరి బెదిరింపులకు సర్పంచ్‌లు లొంగవద్దని కేటీఆర్ సూచించారు. ‘ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకపోవడానికి ఈ ఎమ్మెల్యేలు ఎవరు? అవి మీ అబ్బ సొత్తు కాదు.. మీ అత్త సొత్తు కాదు’అన్నారు. రేవంత్‌రెడ్డి ఏమైనా తన భూములు అమ్మి గ్రామాలకు నిధులిస్తు న్నారా అని ప్రశ్నించారు.
ప్రజల పైసలతో కడుతున్న ఇళ్లకు అర్హులను ఎంపిక చేసే పూర్తి అధికారం గ్రామ సభలకు, సర్పంచ్‌లకే ఉంటుందన్నారు. ఎవడైనా అడ్డు తగిలితే తాట తీసి లైన్‌లో పెట్టాలని కార్యకర్తలకు తెలిపారు. రెండేళ్లైనా ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం..ఇప్పుడు ఎలా గ్రామాలకు నిధులు ఇస్తుందని ప్రశ్నించారు.
‘కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుంచి రావా ల్సిన రూ.3,500 కోట్ల నిధుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసి, రిజర్వేషన్లను 24% నుంచి 17%కి తగ్గించి హడావుడిగా ఎన్నికలు జరిపిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, జాజుల సురేందర్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఖానాపూర్ ఇన్‌చార్జ్ జాన్సన్‌నాయక్ పాల్గొన్నారు.


