సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది శాసనసభ్యులపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఈ నెల 18లోగా ఏదో ఒక నిర్ణయాన్ని తమకు సీల్డ్ కవర్‌లో సమర్పించాలంటూ సుప్రీంకోర్టు గత విచారణ సందర్భంగా ఆదేశించిన నేపథ్యంలో స్పీకర్ గత నెల రోజులుగా ఎమ్మెల్యేల విచారణను వేగవంతం చేశారు.
బీఆర్‌ఎస్ తరఫు న్యాయవాదులతోపాటు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులను బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు రావాల్సిందిగా స్పీకర్ ఆదేశించినట్లు తెలిసింది. దీంతో స్పీకర్ కీలక నిర్ణయం ప్రకటించవచ్చని ప్రచారం జరుగుతోంది.
లేదంటే తుది విడతగా మరోసారి న్యాయవాదులతో చర్చించాక నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా తెలియచేసే అవకాశం ఉందని అంటున్నారు.


