తాడేపల్లి : పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదక మీద కూడా ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో నిర్మాణం చేయమని ఆ కమిటీ చెప్పలేదన్నారు. కానీ స్టాండింగ్ కమిటీ నివేదిక పైనా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తన్నారన్నారు.
ఈరోజు(మంగళవారం, డిసెంబర్ 16వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి విడదల రజిని మాట్లాడుతూ.. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదిక పై చర్చకు తామె పిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం సిద్ధమా? అని సవాల్ విసిరారు.
‘పేదల ఆరోగ్యంపై చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదు. ఎంబీబీఎస్ సీట్లు విషయంలో రాష్ట్రాల వారీగా అసమానతలు ఉన్నాయని స్టాండింగ్ కమిటీ చెప్పింది. కొన్ని రాష్ట్రాల్లో నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువ, మరికొన్ని రాష్ట్రాల్లో తక్కువ సీట్లు ఉన్నాయని కమిటీ చెప్పింది. ఇలాంటి అసమానతలు ఉండ కూడదనే వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు.
కూటమి ప్రభుత్వంలో పీపీపీ పేరుతో చంద్రబాబు స్కాం కి తెరలేపారు. రాష్ట్రాలు ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంటే PPP పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేయమని చెప్పింది. అంతేకాని ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలలను ఇవ్వమని చెప్పలేదు. చంద్రబాబు ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నా. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ppp కి ఇవ్వమని కమిటీ ఎక్కడ చెప్పిందో చూపించాలి. దీనిపై చర్చకు మేము సిద్దం, మీరు సిద్దమా?’ అని సవాల్ చేశారు.


