కరీంనగర్ కార్పొరేషన్: ‘పొర్లు దండాలు పెడుతున్నా.. రోడ్లు వేయండి. డ్రైనేజీలు కట్టండి. వెనుకబడిన కిసాన్‌నగర్‌ను అభివృద్ధి చేయండి’అంటూ బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు సోమిడి వేణు ప్రసాద్ వినూత్న తరహాలో నిరసన తెలిపాడు. సోమవారం కరీంనగర్ 3వ డివిజన్ కిసాన్‌నగర్‌లోని బీడీ కంపెనీ నుంచి మీ సేవ వరకు బురద రోడ్లపై పొర్లు దండాలు పెడుతూ సమస్యలు పరిష్కరించాలన్నాడు.
ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ కిసాన్‌నగర్ అభివృద్ధి విషయంలో గత ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించాయని ఆరోపించాడు. జిల్లా అధికారులకు, నగరపాలక సంస్థ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు అనేకసార్లు ఇక్కడి ప్రాంత అభివృద్ధి కోసం వినతిపత్రాలు ఇచ్చినా సమస్యలు పరిష్కారం కాలేదన్నా డు. పాతికేళ్ల నుంచి ఇక్కడ రోడ్డు వేయలేదని, డ్రైనేజీ నిర్మించలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. బీజేపీ నాయకులు మెంగని రాజయ్య, బండిపల్లి సంజీవ్, గాలి సురేశ్, కల్యాణ్, సుమన్, చాడ ఆనంద్, మేకల సాయి పాల్గొన్నారు.


