మహబూబాబాద్ రూరల్: అదనపు కట్నం కోసం భర్త, అత్తామామ, మరిది విచక్షణరహితంగా కొట్టడంతో మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన బానోత్ స్వప్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మృతురాలి తండ్రి అర్జున్ ఫిర్యాదు మేరకు స్వప్న భర్త బానోత్ రామన్న, అత్తామామలు కిషన్, బుజ్జి, మరిది నవీన్‌పై మహబూబాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో స్వప్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడానికి పోలీసులు సిద్ధంకాగా మృతురాలి కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు ఆమె ఇద్దరు కూతుళ్లు, కుమారుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. మొదట పోస్టుమార్టం గది వద్ద ఆందోళన చేపట్టి అక్కడ నుంచి అండర్ బ్రిడ్జి ప్రాంతంలో రాస్తారోకో చేశారు.
సుమారు రెండు గంటలకుపైగా రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. తమకు న్యాయం జరగడంలేదని ఆరోపిస్తూ మృతురాలి స్వప్న తమ్ముడు లింగా, తల్లి కౌసల్య, మరికొంతమంది ఆత్మహత్య చేసుకుంటామని పురుగు మందు డబ్బాలతో ఆందోళన చేయగా బంధువులు అడ్డుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పోస్టుమార్టం గది వద్దకు చేరుకుని స్వప్న మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చి రోడ్డుపై ఆందోళన చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోస్టుమార్టం గది గేటు తొలగించుకుని ఆగ్రహంతో లోపలికెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
ఆ సమయంలో కొంత తోపులాట జరగగా పోలీసులు వారందరినీ ఆపి శాంతింపజేశారు. అప్పటికే మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు స్వప్న కుమార్తెలు సంజన, దక్షిత, కుమారుడు అవిరాజ్ పరిస్థితి ఏమిటని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మహబూబాబాద్ రూరల్, టౌన్ సీఐలు సర్వయ్య, మహేందర్ రెడ్డి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పెదమనుషులు వారి డిమాండ్ మేరకు ముగ్గురు పిల్లలకు ఆస్తి, వ్యవసాయ భూమి, బంగారం చెందేలా మాట్లాడి ఒప్పంద పత్రాలు రాయించాక పోస్టుమార్టం ఒప్పుకున్నారు. బయ్యారం సీఐ రవికుమార్, రూరల్, టౌన్, కురవి ఎస్సైలు దీపిక, షాకీర్, సతీశ్, సివిల్, స్పెషల్ పార్టీ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
చనిపోయిన మహిళ నోట్లో పురుగుల మందు పోసి...


