‘తెలంగాణ రైజింగ్ - 2047’ విజన్ డాక్యుమెంట్ నేల విడిచి సాము చేస్తోందా? లక్ష్యాలు ఘనంగానే పెట్టుకున్నా.. ఆచరణలో సాధ్యాసాధ్యాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పది వ్యూహాలు... మూడు మూల స్థంభాలున్న ఈ విజన్ డాక్యుమెంట్‌లో 13 గేమ్ చేంజర్ ప్రాజెక్టులు కీలకం. భారత్ ఫ్యూచర్ సిటీ ముఖ్యమైంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ ప్రాజెక్టు కోసం కేసీఆర్ హయాంలో ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూములకు అదనంగా మరికొంత చేర్చి సుమారు 30 వేల ఎకరాలు సిద్ధం చేశారు.
శ్రీశైలం-నాగార్జున సాగర్ రహదారుల మధ్య ప్రాంతంలోని ఊళ్లలో ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టుకు ప్రధాన్యత ఇవ్వడం కోసం ఫ్యూచర్ సిటీలోనే పెట్టుబడుల సదస్సు కూడా నిర్వహించారు. కొత్తగా వచ్చే పరిశ్రమలు, స్కిల్ యూనివర్శిటీ, ఏఐ యూనివర్శిటీలు ఈ సిటీలో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. అయితే బీఆర్‌ఎస్ మాత్రం సొంత రియల్ఎస్టేట్ ప్రయోజనాల కోసం రేవంత్ బృందం ఫ్యూచర్ సిటీని రంగంలోకి తీసుకు వచ్చిందని ఆరోపిస్తోంది.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించినభూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తామని ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు వాటిని వివిధ పరిశ్రమలకు కేటాయించాలని నిర్ణయించుకుంది. అయితే ఈ ఒక్క ప్రాజెక్టుతోనే హైదరాబాద్ న్యూయార్క్ లేదా డల్లాస్ వంటి అంతర్జాతీయ నగరాల స్థాయికి చేరుకుంటుందని భ్రమపెట్టడం అంత మంచిది కాదు. అయితే హైదరాబాద్ పరిసరాల్లోని మరో 27 మున్సిపాల్టీలను, గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని ప్రభుత్వం తలపెట్టిన నేపథ్యంలో ఫ్యూచర్ సిటీకి మరింత ప్రాధాన్యత వచ్చే అవకాశం ఉంటుంది.
గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులలో మూసీ పునరుద్ధరణ కూడా ఒకటి. గ్లోబల్ సమ్మిట్ ప్రచార ప్రకటనలో ఒక గ్రాఫిక్ చిత్రాన్ని ప్రదర్శించారు.అందులో నగరంలోని వివిధ నిర్మాణాలు అద్బుతంగా కనిపిస్తాయి. మూసీ ప్రాజెక్టు ఊహాచిత్రం కూడా ఉంటుంది. కాని వేల కోట్ల వ్యయం అయ్యే ఈ ప్రాజెక్టుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అవన్ని క్లియర్ అయితే పరిశుభ్రమైన వాతావరణం, నది పూర్తిగా క్షాళన జరిగితే హైదరాబాద్ కు నిజంగానే ఒక హారంగా ఇది ఉంటుంది.
డ్రై పోర్టు, దాన్నుంచి కృష్ణపట్నం వరకు 12 లైన్ల ఎక్స్‌ప్రెస్ హైవే, బెంగుళూరు, అమరావతి మీదుగా చెన్నైకి హైదరాబాద్ నుంచి బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ఏర్పాటు కావాలని ఈ విజన్ డాక్యుమెంట్ లక్షించింది. ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం ఓడరేవు వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే కూడా ఈ ప్రతిపాదనలలో ఉంది. దాదాపు పదేళ్ల క్రితం ముంబై నుంచి అహ్మదాబాద్ కు బుల్లెట్ రైలు నడపడం కోసం ఒక కారిడార్ నిర్మిస్తున్నారు. అది ఇంకా పూర్తి కాలేదు. అయినా దేశవ్యాప్తంగా ఈ బుల్లెట్ రైళ్ల డిమాండ్ ఉంది.
కొన్ని రాష్ట్రాలు అయితే వచ్చే రెండు, మూడేళ్లలోనే బుల్లెట్ రైళ్లు వచ్చేస్తాయన్నట్లు ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నాయి.దేశం అంతటా ఇవి ఏర్పాటు కావాలంటే లక్షల కోట్ల నిధులు అవసరమవుతాయి. వచ్చే దశాబ్దాలలో సాంకేతిక పరిజ్ఞానం ఇంకా బాగా మెరుగైతే, అప్పుడు వేగంగా ఈ బుల్లెట్ రైళ్లు సాకారం అవుతాయేమో తెలియదు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డుకు మధ్య ప్రాంతంలో మాన్యుఫ్యాక్చర్ రంగాన్ని అభివృద్ది చేయాలని ఈ విజన్ లో తెలిపారు.
వీటికి అనుసంధానంగా రేడియల్ రోడ్లు నిర్మిస్తారు. రీజినల్ రింగ్ రైల్వే, ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్స్, గ్రీన్ ఎనర్జీ హబ్స్ వంటివాటిని కూడా ప్లాన్ చేయవలసి ఉంటుంది. ఇవన్ని చూస్తే హైదరాబాద్ కేంద్రంగానే ఈ విజన్ డాక్యుమెంట్ అధికంగా ఉన్నట్లు అనిపిస్తుంది. హైదరాబాద్ మరింత విస్తరిస్తే ప్రభుత్వ పాలన ఎంత సమర్థంగా ఉంటుందన్నది అప్పుడే చెప్పలేం. అయితే మూడు జోన్ల రాష్ట్రంగా మార్చాలని యోచిస్తున్నారు.ఈ గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులకు ఎంత వ్యయం అవుతుందన్న దానిపై అంచనాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి.
మరో వైపు 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలన్నది మరో లక్ష్యంగా ఉంది. ప్రస్తుతం డాలర్ విలువ 90 రూపాయలు ఉంది. వచ్చే ఇరవై,పాతికేళ్లలో ఇది ఏ స్థాయికి పెరుగుతుందో ఊహించలేం. ఈ రకంగా చూస్తే ఈ లక్ష్యం సాధన అంత తేలిక కాదు. కాకపోతే రాష్ట్రాలు ప్రచారం కోసం ఈ అంకెలను చెబుతున్నట్లు అనిపిస్తుంది. ప్రభుత్వం సులభతర విధానాలు, డిజిటల్ పాలన, నాలెడ్జ్ హబ్, పెట్టుబడిదారుల ప్రత్యేక నిధి, వాటర్ గ్రిడ్, భూగర్భ డ్రైనేజీ, చెరువుల పునరుద్దరణ, వచ్చే వందేళ్ల వరకు హైదరాబాద్ కు నీటి కరువు లేకుండా చూడడం వంటి వ్యూహాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఆర్థికాభివృద్ధి, సమ్మిళిత అభివృద్ది, సుస్థిర అభివీద్ది అనేవాటిని మూల స్తంభాలుగా చేసుకుని పనిచేస్తామని తెలిపారు.ఇవన్ని చదవడానికి బాగానే ఉండవచ్చు. ఒక ఉదాహరణ చూస్తే ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెంలలో కొత్త విమానాశ్రయాలను ప్రతిపాదించారు. ప్రస్తుతం దేశంలో కొత్తగా నిర్మించిన వాటిలో సుమారు నలభై ఎయిర్ పోర్టులకు డిమాండ్ లేదని వార్తలు సూచిస్తున్నాయి. అయినా హైదరాబాద్ చుట్టూరా కొత్తగా ఈ ఎయిర్ పోర్టులు ఎప్పటికి వస్తాయో, అవి ఎంతవరకు బాగా నడుస్తాయో తేలడానికి చాలా సమయం పట్టవచ్చు.
ఈ విజన్ డాక్యుమెంట్ లో ప్రస్తుతం రాష్ట్రానికి ఉన్న అప్పు, 2047 నాటికి ఎంత మొత్తం అవుతుంది? లేదా ఎంత రుణం తీర్చగలుగుతారు? ఆర్థిక వనరులు ఎలా మెరుగు అవుతాయి? మొదలైనవాటిపై అంచనాలు వేయకుండా ఎన్ని విజన్ డాక్యుమెంట్లు రాసుకున్నా ప్రజలకు ఒరిగేదేమీ ఉండకపోవచ్చు. గతంలో ఉమ్మడి ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు విజన్ 2020 డాక్యుమెంట్ అంటూ భారీ హడావుడి చేశారు.
అతిశయోక్తులతో అంకెల గారడి చేశారు.కాని వాటిలో ఒక్క లక్ష్యం అయినా నెరవేరిందని చెప్పలేని పరిస్థితి. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలలో ఫలితాలు ఎలా ఉంటాయో ఎవరూ ఊహించలేరు.ప్రస్తుత ప్రభుత్వమే కొనసాగినా, కొత్త ప్రభుత్వం వచ్చినా, ఎప్పటికప్పుడు కొత్త, కొత్త ఆలోచనల మధ్య ఈ విజన్ డాక్యుమెంట్లను ప్రభుత్వాలు పట్టించుకోవడం కూడా పెద్దగా ఉండకపోవచ్చు.ఏది ఏమైనా పాలకులకు ప్రచారానికి, ఆశల పందిరి వేసి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రస్తుతానికి ఈ విజన్ డాక్యుమెంట్లు పనికి రావచ్చేమో!
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


