సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిని కస్టడీ విచారణ జరుపుతున్నారనే పేరుకు తప్పించి.. ఎలాంటి వివరాలు రాబట్టలేకపోతోంది ప్రత్యేక దర్యాప్తు బృందం. గత నాలుగు రోజులుగా ఏమాత్రం సహకరించని ఆయన.. ఐదోరోజైనా నోరు మెదపకపోతారా? అని ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావు కస్టడీ విచారణ ఐదో రోజు కొనసాగుతోంది. ఆధారాలను ముందుంచి ఆయన్ని పశ్నిస్తోంది సిట్. అయితే ఆయన మౌనంగానే ఉంటున్నట్ల సమాచారం. మాజీ అధికారి ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని జూబ్లీహిల్స్‌లోని సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) వర్గాలు చెబుతున్నాయి . సిట్ జరిపిన నాలుగు రోజుల విచారణలో ఎలాంటి పురోగతి లేదని సమాచారం.
ఈ కేసులో డిజిటల్ ఆధారాలే కీలకంగా మారడంతో.. ప్రభాకర్ రావుకు సంబంధించిన ఐక్లౌడ్, జిమెయిల్ ఖాతాలపై సిట్ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభాకర్ రావు వినియోగించిన 5 ఐక్లౌడ్, 5 జిమెయిల్ ఖాతాల్లోని డేటాను సిట్ పరిశీలించింది. గతంలో ప్రభాకర్ రావు నాలుగు జిమెయిల్ ఖాతాలు, రెండు ఐక్లౌడ్ ఖాతాల పాస్వర్డ్లు అందజేశారు. కానీ, ఆ ఖాతాల్లో డేటా కనిపించకపోవడంతో.. తలలు పట్టుకున్నారు. అటు నుంచి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL)కు డివైసులను పంపించారు.
ఆపై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి లభించిన సాంకేతిక నివేదికల ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించారు. అయితే ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో సిట్ అధికారుల తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది. వారంపాటు కస్టడీ విచారణ తర్వాత సుప్రీం కోర్టులో ప్రభాకర్‌రావు విచారణ వివరాలను.. ఫోన్ ట్యాపింగ్ కేసు పురోగతిని తెలంగాణ ప్రభుత్వం సమర్పించాల్సి ఉందన్నది తెలిసిందే.


