జీహెచ్‌ఎంసీ విస్తరణ నేపథ్యంలో భవన నిర్మాణ అనుమతులపై చర్చ
వేచిచూసే ధోరణిలో బిల్డర్లు, మధ్యతరగతి వర్గాలు
అధికారాలు బదిలీ అయ్యే వరకు హెచ్‌ఎండీఏ నుంచే అనుమతులు
ఈసీ సమావేశం తర్వాతే అధికారాల బదిలీ ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ విస్తరణ నేపథ్యంలో భవన నిర్మాణ అనుమతులపైన స్తబ్దత నెలకొంది. ప్రస్తుతం నగర శివారు మున్సిపాలిటీల పరిధిలో అన్ని రకాల బహుళ అంతస్థుల భవనాలు, అపార్ట్‌మెంట్లు, లేఅవుట్‌లు తదితర నిర్మాణ రంగానికి చెందిన అనుమతులు హెచ్‌ఎండీఏ నుంచి లభిస్తున్నప్పటికీ నిర్మాణ సంస్థలు, రియల్టర్‌లు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. మరోవైపు సొంత ఇల్లు కట్టుకొనేందుకు ఎదురుచూస్తున్న లక్షలాది మంది సామాన్య, మధ్యతరగతి ప్రజలు మాత్రం తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. మున్సిపాలిటీ నుంచి అనుమతులు తీసుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు.
జీహెచ్‌ఎంసీలో విలీనమయ్యే 27 మున్సిపాలిటీలకు సంబంధించిన ప్రాంతాలు, సరిహద్దులపైన స్పష్టత వచ్చే వరకు ఈ గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో జీహెచ్‌ఎంసీ విస్తరణ ప్రక్రియ ముందుకొచి్చంది. హైదరాబాద్ మహానగరం విస్తరణ, అభివృద్ధిలో ఇదో మైలురాయిగా భావిస్తున్నప్పటికీ వివిధ అంశాల్లో ఇంకా స్పష్టత లేకపోవడం వల్ల గందరగోళం కనిపిస్తోంది. బడా నిర్మాణ సంస్థలు సైతం ఒక అడుగు వెనక్కి వేసి వేచి చూసే ధోరణిలోనే ఉన్నట్లు అంచనా. మధ్యతరగతి ప్రజలు మాత్రం ఎక్కడి నుంచి అనుమతులు తీసుకోవాలో తెలియక నిర్మాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ఔటర్‌రింగ్ రోడ్డు వరకు సుమారు 2000 చ.కి.మీ.వరకు జీహెచ్‌ఎంసీ విస్తరించనున్న దృష్ట్యా సరిహద్దులోని ప్రాంతాల విలీనంపైన మరింత స్పష్టత రావలసి ఉంది.
ఇప్పుడు హెచ్‌ఎండీఏ నుంచే....
ప్రస్తుతం హైరైజ్ బిల్డింగ్‌లతో పాటు అన్ని రకాల భవనాలు, లే అవుట్‌లకు హెచ్‌ఎండీఏ అనుమతులను అందజేస్తోంది. జీహెచ్‌ఎంసీ విలీన ప్రకటన అనంతరం శివారు మున్సిపాలిటీల వరకు హెచ్‌ఎండీఏ నుంచి అనుమతుల ప్రక్రియను నిలిపివేశారు. దీంతో అన్ని వర్గాల్లోనూ గందరగోళం ఏర్పడింది. ఆ తరువాత హెచ్‌ఎండీఏ అనుమతుల ప్రక్రియను పునరుద్ధరించినప్పటికీ ప్రజల్లో ఈ గందరగోళం కొనసాగడం గమనార్హం. సాధారణంగా ఐదంతస్థుల వరకు మున్సిపాలిటీ నుంచి అనుమతులు తీసుకొనే అవకాశం ఉంది. ఆ తరువాత పై అంతస్తుల నిర్మాణం కోసం హెచ్‌ఎండీఏ నుంచి అనుమతి తీసుకోవలసి ఉంటుంది.
ఇప్పుడు జీహెచ్‌ఎంసీలో విలీనం కావడం వల్ల వివిధ సంస్థల మధ్య ఈ అంతస్థుల ఎలా ఉండనుందోనేనే అంశంపైన స్పష్టత వెలువడాల్సి ఉంది. ‘ఇటు జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేయాలా లేక, అటు హెచ్‌ఎండీఏకు దరఖాస్తు చేయాలా తెలియడం లేదు. పైగా ఈ రెండు సంస్థల మధ్య ఫీజుల్లోనూ వ్యత్యాసం ఉంటుంది కదా. అందుకే స్పష్టత వచ్చే వరకు ఎదురు చూడడమే మంచిదనిపిస్తుంది.’ అని మేడ్చల్ ప్రాంతానికి చెందిన ఓ బిల్డర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ మినహాయించి ట్రిపుల్ ఆర్ వరకు హెచ్‌ఎండీఏ పరిధిలోని 11 జిల్లాల్లో సుమారు 10,050 చ.కి.మీ.పరిధిలో హెచ్‌ఎండీఏ వివిధ రకాల నిర్మాణ అనుమతులను అందజేస్తుంది.
బదిలీ ఎలా చేస్తారో...
ఇప్పుడు హెచ్‌ఎండీఏ. జీహెచ్‌ఎంసీ రెండు సంస్థల మధ్య అధికారాల బదిలీ కీలకంగా మారింది. నిర్మాణ రంగానికి సంబంధించినంత వరకు హెచ్‌ఎండీఏ నుంచే జీహెచ్‌ఎంసీకి అధికారాలను బదిలీ చేయవలసి ఉంది. అప్పట్లో 12 శివారు మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలతో కలిసి జీహెచ్‌ఎంసీ ఆవిర్భవించిన సమయంలో కూడా హెచ్‌ఎండీఏ నుంచే నిర్మాణ రంగానికి సంబంధించిన అధికారాలు జీహెచ్‌ఎంసీకి బదిలీ అయ్యాయి. ప్రస్తుతం అదే పద్ధతిలో బదిలీ చేయవలసి ఉంటుంది. కానీ హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండే ప్రాంతాలు, నిర్మాణ అనుమతులు, జీహెచ్‌ఎంసీలో విలీనమయ్యే ప్రాంతాలు, నిర్మాణ అనుమతులు, రెండు సంస్థల మధ్య సరిహద్దు ప్రాంతాలపైన స్పష్టత రావాల్సి ఉంది. ఈ క్రమంలో హెచ్‌ఎండీఏ నిర్వహించనున్న ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కీలకం కానుంది. ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరించే ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సమావేశం ఎప్పుడు జరుగనుందనే అంశంపైన కూడా స్పష్టత లేదు. అప్పటి వరకు అనుమతు ప్రక్రియలో ఈ స్తబ్దత కొనసాగే అవకాశం ఉంది.


