కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో గంగవ్వ
సర్పంచ్‌గా విజయం సాధించిన 82 ఏళ్ల వృద్ధురాలు
మేడిపల్లి: వారిది నిరుపేద కుటుంబం. గౌడవృత్తితోపాటు ఉన్న ఎకరంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గ్రామానికి ఎప్పటికైనా సర్పంచ్ కావాలని ఆ ఇంటి యజమాని కల కనేవాడు. అలా ప్రతిసారి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేవాడు. ఆర్థికంగా లేకపోవడంతో ప్రతిసారీ ఓడిపోయాడు. తన భర్త చివరి కోరికను కొడుకుకు చెప్పగా.. పట్టువదలని విక్రమార్కుడిలా ఈసారి ఎన్నికల్లో తల్లిని సర్పంచ్ చేశాడు.
వివరాల్లోకి వెళితే... ఇది జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని కమ్మరిపేట.. భీమారం మేజర్ గ్రామ పంచాయతీలో విలీన గ్రామంగా ఉండేది. గ్రామానికి చెందిన కోటగిరి గంగరాజం, గంగరాజు (గంగవ్వ) దంపతులు. గంగరాజంకు ఎప్పటికైనా సర్పంచ్ కావాలనే కోరిక ఉండేది. అలా చాలాసార్లు సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయాడు. ఆ కోరిక తీరకుండానే గంగరాజం 2009లో చనిపోయారు. ఆ తర్వాత కమ్మరిపేట ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది.
ప్రస్తుతం గంగవ్వ వయస్సు 82 ఏళ్లు. రెండో విడత ఎన్నికలు రాగానే తండ్రి కోరికను కొడుకు లింగగౌడ్‌కు చెప్పింది. దీంతో తండ్రి కోరికను తల్లితోనైనా తీర్చాలనే ఉద్దేశంతో సర్పంచ్‌గా పోటీలో నిలబెట్టారు. నలుగురు పోటీలో ఉండగా.. గంగవ్వ స్వతంత్ర అభ్యర్థిగా 332 ఓట్లు సాధించింది. 128 ఓట్ల మెజారిటీతో సర్పంచ్‌గా గెలిచింది.
విషయం తెలుసుకున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఆమెను కరీంనగర్‌లోని ఆయన కార్యాలయానికి సోమవారం పిలిపించుకున్నారు. ఘనంగా సన్మానించారు. తన భర్త కోరికను కొడుకు ద్వారా తీరిందంటూ ఆ తల్లి బండి సంజయ్ ఎదుట ఆనందబాష్పాలు రాలి్చంది.


