3,752 సర్పంచ్ స్థానాలకు 13,128 మంది,
28,406 వార్డులకు 75,283 మంది బరిలో..
అధికారులు విధుల్లో నిమగ్నం
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం సోమవారం సాయంత్రం 5 గంటలకు పరిసమాప్తం అయింది. మూడో విడతలో భాగంగా బుధవారం (17న) ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. ఓటింగ్ పూర్తయ్యాక ఎక్కడికక్కడ ఎన్నికల అధికారులు ఓట్లు లెక్కించి గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యులను ప్రకటించనున్నారు. ఇది పూర్తికాగానే ఉపసర్పంచ్ ఎన్నిక జరుగుతుంది.
ఈ విడతకు సంబంధించి ఎన్నికల అధికారులు గ్రామ పంచాయతీల్లో ఏర్పాట్లు పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. ప్రీపోల్ అరేంజ్‌మెంట్‌లలో భాగంగా... సోమవారం ఉదయం డి్రస్టిబ్యూషన్ సెంటర్ల నుంచి బ్యాలెట్ బాక్సులు, పత్రాలు ఇతర ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. సమస్యాత్మక గ్రామాలపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బంది కలగకుండా షామియానాలు, తాగునీటి వసతి కల్పించనున్నారు.
మంగళవారం సాయంత్రంకల్లా అన్ని పోలింగ్ బూత్‌లకు ఎన్నికల విధుల్లోని అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది చేరుకుంటారు. మూడోవిడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 4,157 పంచాయతీలకు ఎన్నికలు నోటిఫై చేయగా 11 చోట్ల, 36,434 వార్డుల్లో 112 చోట్ల ఒక్క నామినేషన్లు దాఖలు కాలేదు. 394 సర్పంచ్ స్థానాలు, 7,916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో ఇక మిగిలిన 3,752 సర్పంచ్ పదవులకు 13,128 మంది, 28,406 వార్డులకు 75,283 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.


