హైదరాబాద్‌లో బద్వేలుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టు అరెస్టు
కుమార్తె ఆపరేషన్ కోసం దుబాయ్ నుంచి హైదరాబాద్ రాక
లుకౌట్ నోటీసు ఉండటంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి
భయాందోళనలో కుటుంబ సభ్యులు
బద్వేలు అర్బన్/సాక్షి, హైదరాబాద్ సిటీ బ్యూరో: సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. సుమారు ఏడాదిన్నర క్రితం సోషల్ మీడియాలో ఓ పోస్టును ఫార్వర్డ్ చేశాడని నమోదైన ఓ కేసులో వైఎస్సార్ కడప జిల్లా బద్వేలుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టు బత్తలపల్లి శ్రీనివాసులరెడ్డిని సోమవారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కడప చిన్న చౌక్ పోలీసులకు అప్పగించారు.
బతుకుదెరువు నిమిత్తం దుబాయ్‌కు వెళ్లిన శ్రీనివాసులరెడ్డి.. కుమార్తె ఆపరేషన్ ఏర్పాట్ల కోసం దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు లుకౌట్ నోటీసు ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తమ కుమారుడికి ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. బద్వేలులోని తెలుగుగంగ కాలనీ రోడ్డులో నివసించే రమణారెడ్డి, లక్షుమ్మ కుమారుడైన శ్రీనివాసులరెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. వైఎస్సార్‌సీపీ అభిమాని అయిన శ్రీనివాసులరెడ్డి సామాజిక మాధ్యమాల్లో వచ్చే కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను షేర్ చేస్తుంటారు. సుమారు ఏడాదిన్నర క్రితం ఆయనపై కడపలోని ఓ పోలీసు స్టేషన్‌తోపాటు బాపట్ల, రేపల్లె, తదితర పోలీసు స్టేషన్లలో ఏకంగా 26 కేసులు నమోదైనట్టు తెలిసింది.
కుమార్తె ఆపరేషన్ కోసం వచ్చి..
శ్రీనివాసులరెడ్డికి సుహిత, సుబ్బారెడ్డి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో సుహిత మూగ, అంధత్వంతో బాధ పడుతోంది. ఏడాదిన్నర క్రితం హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్ ఆస్పత్రిలో ఒక కంటికి చికిత్స చేయించారు. మరో కంటికి చికిత్స చేయించేందుకు అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. ఇందుకోసం దుబాయ్ నుంచి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వెంటనే శ్రీనివాసులరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బద్వేలులోని ఆయన తల్లిదండ్రులు, భార్య కన్నీటి పర్యంతమయ్యారు.
తన కుమారుడికి ఏ పాపం తెలియదని, అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరపున ఏజెంట్‌గా కూర్చోవడమే తమ కుమారుడు చేసిన తప్పా అని వాపోయారు. కాగా, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అధైర్య పడొద్దని, పార్టీ తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని ఎమ్మెల్యే డాక్టర్ సుధ పేర్కొన్నారు. ఎమ్మెల్యే, పార్టీ లీగల్ సెల్ న్యాయవాది శ్రీనివాసులరెడ్డి కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు.


