మనాలీలో ‘స్నో స్కామ్’ బట్టబయలు
కృత్రిమ మంచుతో ఘరానా మోసం
పర్యాటకుల నుంచి భారీ వసూళ్లు!
మంచు అందాలను ఆస్వాదించడానికి మనాలీకి వెళ్లే పర్యాటకులకు షాకింగ్ నిజం బయటపడింది. అక్కడి గైడ్‌లు.. పర్యాటకుల నుంచి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేసి, కృత్రిమ మంచుతో మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్న ఒక పర్యాటకుడి వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
ట్రక్కుల్లో మంచును తరలించి..
ట్రక్కుల్లో మంచును తరలించి, దానిని నేలపై పోసి, పర్యాటకులతో ఆటలు ఆడిస్తుండటాన్ని ఈ వీడియో బయటపెట్టింది. అతుల్ చౌహాన్ అనే పర్యాటకుడు ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో, మనాలీలో జరుగుతున్న ’స్నో స్కామ్’ను బట్టబయలు చేశారు. ‘చివరికి, మనాలీలో మంచు ఎలా కురుస్తుందో మీకు చూపిస్తాను. చూడండి.. ఈ వ్యక్తులు మంచును ట్రక్కుల్లో తీసుకువచ్చారు.
ఇక్కడ కుమ్మరిస్తున్నారు. ఆ తర్వాత ఈ మంచుపై పర్యాటకులతో ఆడిస్తారు’.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో సహజమైన మంచు ఏ మాత్రం లేదని, పరిసరాలు బీడు భూమిలా కనిపిస్తున్నాయని వీడియో స్పష్టం చేసింది. కొందరు వ్యక్తులు ట్రక్కుల నుంచి పారలతో కృత్రిమ మంచును దించి, నేలపై చల్లడం కనిపించింది. పర్యాటకులు కృత్రిమ మంచుపైనే స్కేటింగ్ చేస్తూ, ఆటలాడుతూ కనిపించారు.
గ్లోబల్ వార్మింగ్
ఈ వీడియో ఇంటర్నెట్‌లో కలకలం సృష్టించింది. చాలా మంది నెటిజన్లు దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అధిక అడవుల నిర్మూలన, అనియంత్రిత నిర్మాణాల కారణంగా.. సహజంగా మంచు కురవడం తగ్గిపోయిందని, ఇది గ్లోబల్ వార్మింగ్ ప్రభావమని కొందరు వ్యాఖ్యానించారు. మరొకరు స్పందిస్తూ, ‘పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మంచు ఉంటుందని చెప్పి, స్నో సూట్‌ల కోసం అధిక రేట్లు వసూలు చేస్తున్నారు. కానీ పర్యాటకులు చివరకు చూసేది చిన్న మంచు ప్యాచ్ మాత్రమే. దానికి అంత డబ్బు, శ్రమ అవసరం లేదు’.. అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ’స్నో స్కామ్’ ఘటన.. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాన్ని, మరోవైపు పర్యాటక రంగంలో జరుగుతున్న మోసాలను బట్టబయలు చేసింది.
– సాక్షి, నేషనల్ డెస్క్


