బ్యాంకులు 6 శాతం వడ్డీకి ఇస్తామంటే.. ప్రైవేటుగా 9.3 శాతం వడ్డీకి తెస్తారా?
లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్షనేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చెప్పారు. లోక్‌సభలో సోమవారం అనుబంధ పద్దులపై జరిగిన చర్చలో పాల్గొన్న మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వ తీరును, కేంద్రం చూసీచూడనట్లు వ్యవహరించడాన్ని ఎండగట్టారు. బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని ముందుకొస్తున్నా.. కమీషన్ల కక్కుర్తితో అధిక వడ్డీలకు ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు తెస్తున్నారని చెప్పారు.
ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా తెచ్చే ఈ అప్పులకు ఏకంగా రాష్ట్ర ఖజానా (కన్సాలిడేటెడ్ ఫండ్) నుంచే నేరుగా చెల్లింపులు చేసేలా ఒప్పందాలు చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో రూ.3.32 లక్షల కోట్లు అప్పు చేస్తే.. ఈ ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని మండిపడ్డారు. గతంలో అప్పుల వృద్ధి రేటు (సీఏజీఆర్) 13.5 శాతంగా ఉంటే, ప్రస్తుతం అది దేశంలోనే అత్యధికంగా 22 శాతానికి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రూ.150 కోట్ల కమీషన్: ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, బేవరేజెస్ కార్పొరేషన్ల పేరుతో ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు (9.3 శాతం) నిధులు సమీకరిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకులు 6 శాతానికే రుణాలు ఇస్తుంటే.. ప్రైవేటు వ్యక్తుల వద్ద ఎందుకు అప్పులు చేస్తున్నారని ప్రశ్నించారు. కేవలం 1.5 శాతం బ్రోకరేజ్ కమీషన్ కోసమే ఈ దందా నడుస్తోందని, దాదాపు రూ.150 కోట్ల ప్రజాధనాన్ని కమీషన్ల రూపంలో దోచుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై కేంద్రం పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
అంతేగాక ప్రైవేటు వ్యక్తుల నుంచి తెచ్చే అప్పులకు గ్యారెంటీగా రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్‌ను చూపించడం, ప్రభుత్వ అనుమతి లేకుండానే అందులోంచి డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించడం దుర్మార్గమని చెప్పారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ల అప్పులను కూడా రాష్ట్ర అప్పులుగానే పరిగణిస్తామని లేఖలు రాసిన కేంద్ర ఆర్థికశాఖ.. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉందని నిలదీశారు.
ఇప్పుడు నిబంధనలు మారాయా? లేక కూటమి ప్రభుత్వానికి ఒక న్యాయం, మాకో న్యాయమా?.. అని ప్రశ్నించారు. మరోవైపు రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కూలీలకు గత ఏడు నెలలుగా డబ్బులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి సొంత రాష్ట్రం, సొంత నియోజకవర్గంలోనే ఈ దుస్థితి ఉందంటే సిగ్గుచేటని విమర్శించారు.
ప్రైవేటీకరణను అడ్డుకుంటాం: లాభాల్లో ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించే కుట్రలను సాగనివ్వబోమని స్పష్టం చేశారు. ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించి ప్రభుత్వమే నడపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటుపరం చేయడాన్ని మిథున్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కడప–బెంగళూరు రైల్వేలైన్ నిర్మాణానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.


