అలాగైతే ఈ రేటింగులెలా వస్తాయి: నిర్మల
విపక్షాలపై మంత్రి మండిపాటు
న్యూఢిల్లీ: భారత్ డెడ్ ఎకానమీ అయితే గ్లోబల్ ఏజెన్సీలు అంతంత గొప్ప రేటింగులు ఎలా ఇస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విపక్షాలను ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను డెడ్ ఎకానమీగా పేర్కొనడంపై కేంద్రం వివరణ ఇచ్చి తీరాలని విపక్షాలు సోమవారం లోక్‌సభలో పట్టుబట్టాయి. దాంతో నిర్మల మాట్లాడారు. విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ అని స్పష్టం చేశారు.
సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకంగా 8.2 శాతం వృద్ధి సాధించిందని గుర్తు చేశారు. ‘‘భారత ఆర్థిక వ్యవస్థ గతంలో బయటి సాయంపై ఆధారపడేది. అలాంటిది గత పదేళ్లలో బయటి దేశాలకు ఆదర్శంగా మారేలా ఎదిగింది. డెడ్ ఎకానమీ అన్నదే నిజమైతే డీబీఆర్‌ఎస్, ఎస్ అండ్ పీ, సర్ అండ్ ఐ వంటి ప్రముఖ సంస్థలు మన క్రెడిట్ రేటింగ్‌ను పెంచుతాయా? ఎవరో ఏదో అంటే మనం పట్టించుకోవాలా? ఆరోపణలు చేసేది ఎంత పెద్దవారైనా సరే, గణాంకాలు ఏం చెబుతున్నాయన్నదే చూడాలి. వాటి ఆధారంగానే మాట్లాడాలి’’ అంటూ విపక్షాలకు మంత్రి నిర్మల హితవు పలికారు.
రూ. 41 వేల కోట్ల వ్యయానికి లోక్ సభ ఆమోదం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పలు కీలక శాఖలకు సంబంధించి రూ.41,455 కోట్ల మేరకు అదనపు వ్యయానికి లోక్‌సభ అనుమతి మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్‌లను సోమవారం ఆమోదించింది. దీన్ని బడ్జెట్ రూపకల్పనలో అసమర్థతగా విపక్ష ఎంపీలు చేసిన విమర్శలను మంత్రి నిర్మల తిప్పికొట్టారు. బాధ్యతాయుత ప్రభుత్వానికి ఇలాంటి సప్లిమెంటరీ డిమాండ్లు చాలా అవసరమన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎరువుల కొరత లేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటామని చెప్పారు.


