భారత్‌లో త్వరలో సాకారం!
కొత్త కార్మిక చట్టాల్లో వెసులుబాటు
కంపెనీలు, సిబ్బంది ఇష్టమే
రోజువారీ పని గంటల పెంపు
అయితే వారానికి 48 దాటరాదు
కొద్దిరోజుల్లో పూర్తి స్పష్టత!
వారానికి పని దినాలు ఎన్ని? ఇదేం ప్రశ్న అంటారా? మన దగ్గరైతే మెజారిటీ కంపెనీలు, సంస్థల్లో ఆరు పనిదినాలు. విదేశాల్లోనైతే ప్రభుత్వంలోనైనా, ప్రైవేటులోనైనా ఐదుకు మించవు. మన దగ్గర కూడా ఐటీ వంటి రంగాల్లో ఎన్నో ఏళ్లుగా వారానికి ఐదు రోజుల పని సంస్కృతి అమల్లో ఉంది. కాకపోతే ఆరేడు రోజులకు మించిన పని ఆ ఐదు రోజుల్లోనే చేయిస్తారని ఈ ఐటీ జీవులు వాపోతూ ఉంటారన్నది వేరే సంగతి.
అయితే, వారానికి నాలుగే పని దినాలుంటే? ఆ ఆలోచనే చాలా బాగుంది కదా! విదేశాల్లో సాధ్యమేమో గానీ మన దగ్గర ఎక్కడ కుదురుతుంది లెమ్మని అనిపిస్తోందా? కానీ ఇది అచ్చంగా భారత్ గురించే! కొత్త కార్మిక చట్టాలు వారానికి నాలుగు రోజుల పనికి నిజంగానే వీలు కల్పిస్తున్నాయి. ఇక కంపెనీలు నిర్ణయం తీసుకోవడం తరువాయి, ఉద్యోగులు వారంలో నాలుగే రోజులు పని చేసి, మూడు రోజులు
వేతనంతో కూడిన సెలవులు ఆస్వాదించవచ్చు...!
పాతకాలం నాటి 29 కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం గత నవంబర్ 21న రద్దు చేసింది. వాటి స్థానంలో నాలుగు కొత్త లేబర్ కోడ్స్ అమల్లోకి తేవడం తెలిసిందే. వాటిలో భాగంగా వారానికి నాలుగు పని దినాలకు కూడా అనుమతిస్తోంది. కొందరు ఉద్యోగులతో పాటు కొన్ని సంస్థలు వ్యక్తం చేసిన అనుమానాల నేపథ్యంలో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ దీనిపై స్పష్టత ఇచ్చింది. వారం మొత్తానికి సంబంధించిన పని గంటలను సర్దుబాటు చేసుకునే వెలుసుబాటు సంస్థలు, కంపెనీలకు ఇస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు కూడా పెట్టింది. అయితే ఇందుకు కొన్ని షరతులు
వర్తించనున్నాయి!
రోజుకు 12 గంటల పని...!
వారంలో పని దినాల సంఖ్య తగ్గినా మొత్తం పనిగంటల సంఖ్య మాత్రం తగ్గబోదు. ఉద్యోగులు వారం మొత్తమ్మీద కనీసం 48 గంటలు పని చేయాల్సిందే. అంటే వారంలో 4 రోజులే పనిచేసేలా ఉంటే రోజుకు 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ‘కొత్త కార్మిక చట్టాలు ఇందుకు అనుమతిస్తాయి. అయితే వారంలో పని గంటల సంఖ్య 48కి మించేందుకు వీల్లేదు. మించితే ఆ అదనపు గంటలకు గాను ఉద్యోగులకు కంపెనీలు రెట్టింపు వేతనం చెల్లించాల్సి ఉంటుంది‘ అని కేంద్ర కార్మిక శాఖ స్పష్టం చేసింది. ఆ 12 గంటలు కూడా ఉద్యోగులు నిరంతరాయంగా పని చేయాల్సిన అవసరం లేదు.
భోజన విరామం, షిఫ్టులు మారే నడుమ విరామం వంటివి ఆ 12 గంటల్లో కలిపే ఉంటాయి. వీటన్నింటికీ కంపెనీలు, కొన్నిసార్లు సిబ్బంది ఎంతవరకు ఒప్పుకోవచ్చన్నది ప్రశ్న. అందుకే, ‘వారానికి నాలుగు రోజుల పని కేవలం ఐచ్ఛికమే. కంపెనీ, సిబ్బంది పరస్పర అంగీకారంతో ఆ మేరకు పని చేసుకోవచ్చు. కంపెనీ విధానాలు, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు తదితరాలు కూడా దీనిపై ప్రభావం చూపుతాయి‘ అని కార్మిక శాఖ పేర్కొంది. 24 గంటలూ నిరంతరాయంగా పని చేయాల్సిన రంగాలు, విభాగాలకు ఈ నాలుగు రోజుల పని పనికొచ్చే వ్యవహారం కాదన్నది కార్మిక రంగ నిపుణుల అభిప్రాయం. దీనిపై కంపెనీలు, ఉద్యోగుల స్పందన ఎలా ఉంటుందన్నది తెలిసేందుకు కొద్ది రోజులు పట్టవచ్చు.
– సాక్షి, నేషనల్ డెస్క్


