శతద్రు దత్తాకు 14 రోజుల రిమాండ్
కోల్‌కతా: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లయోనల్ మెస్సీ ప్రస్తుతం ‘గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్) టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా భారత్‌లో మూడు రోజుల పాటు పర్యటిస్తున్నాడు. ఈ టూర్ ముఖ్య నిర్వాహకుడు శతద్రు దత్తా కాగా... తొలిరోజు కోల్‌కతాలో ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసిన కోల్‌కతా పోలీసులు జైలుకు తరలించారు.
కొన్నిరోజులుగా సాల్ట్‌లేక్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ ఆడతాడంటూ ప్రముఖంగా ప్రచారం చేశారు. రూ. వేలల్లో టికెట్లను అమ్మారు. ఫుట్‌బాల్ క్రేజీ బెంగాలీ వాసులు సుమారు 80 వేల మంది వేలకువేలు వెచి్చంచి స్టేడియానికి తరలివెళ్లారు. కానీ తమ ఆరాధ్య ఫుట్‌బాలర్ మెస్సీ పట్టుమని పది నిమిషాలైనా మైదానంలో అలరించలేదు.
ఆ ఉన్న కొద్దిసేపు కూడా చీమలదండు లాంటి భద్రతా వలయంతో ఏ గ్యాలరీలోని ప్రేక్షకుడు కూడా మెస్సీని చూడలేకపోయాడు. దీంతో సూపర్‌స్టార్‌ను ప్రత్యక్షంగా చూసి కన్నుల పండగ చేసుకుందామని రూ.వేలు వెచి్చంచిన అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా వేల మంది విరుచుకుపడటంతో కరతాళ ధ్వనులతో మార్మోగాల్సిన మైదానం రసాభాసగా మారింది.
ఈ ఈవెంట్ నిర్వహణ వైఫల్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అభిమానుల తాకిడి, అంచనాలకు విరుద్ధంగా ఏర్పాట్లు, నిర్వహణ వైఫల్యంపై చీఫ్ ఆర్గనైజర్ శతద్రు దత్తాను శనివారమే అదుపులోకి తీసుకొని ఆదివారం జడ్జి ముందు హాజరు పరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తి... ముఖ్య నిర్వాహకుడికి 14 రోజుల రిమాండ్ విధించడంతో శతద్రును జైలుకు తరలించారు.


