చెన్నై: స్వదేశంలో భారత స్క్వాష్ జట్టు చిరస్మరణీయ ప్రదర్శన చేసింది. ఆదివారం ముగిసిన ప్రపంచకప్ మిక్స్‌డ్ టీమ్ స్క్వాష్ టోర్నమెంట్‌లో తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా జట్టుగా రికార్డు నెలకొల్పింది. హాంకాంగ్ జట్టుతో జరిగిన ఫైనల్లో భారత్ 3–0తో విజయం సాధించింది.
తొలి మ్యాచ్‌లో ప్రపంచ 79వ ర్యాంకర్ జోష్నా చినప్ప 7–3, 2–7, 7–5, 7–1తో ప్రపంచ 37వ ర్యాంకర్ లీ కా యిపై గెలిచి భారత్‌కు శుభారంభం అందించింది. రెండో మ్యాచ్‌లో ప్రపంచ 29వ ర్యాంకర్ అభయ్ సింగ్ 7–1, 7–4, 7–4తో ప్రపంచ 42వ ర్యాంకర్ అలెక్స్ లాయుపై నెగ్గడంతో భారత్ ఆధిక్యం 2–0కు పెరిగింది.
మూడో మ్యాచ్‌లో ప్రపంచ 28వ ర్యాంకర్ అనాహత్ సింగ్ 7–2, 7–2, 7–5తో ప్రపంచ 31వ ర్యాంకర్ టొమాటో హోపై గెలవడంతో భారత్‌కు ప్రపంచకప్ టైటిల్ ఖరారైంది.


