మూడో టి20లో 7 వికెట్లతో టీమిండియా జయభేరి
నిప్పులు చెరిగిన అర్ష్ దీప్, హర్షిత్
తిప్పేసిన వరుణ్, కుల్దీప్
17న లక్నోలో నాలుగో టి20
ధర్మశాల: ధర్మశాల అసలే శీతల ప్రదేశం. ఇక ఈ చలికాలమైతే మంచు గడ్డలా మారాల్సిందే. అలాంటి వేదికపై మన పేసర్లు దక్షిణాఫ్రికా బ్యాటర్లకు సెగ పెట్టారు. ఆరంభంలో పేస్ ప్రతాపం, తర్వాత స్పిన్ మాయాజాలం భారత్‌ను సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలో నిలిపింది. ఆదివారం జరిగిన మూడో టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. టాస్ నెగ్గిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగుల వద్ద ఆలౌటైంది.
కెప్టెన్ మార్క్‌రమ్ (46 బంతుల్లో 61; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే భారత బౌలింగ్‌కు ఎదురు నిలిచాడు. మ్యాచ్ మొదలైన కాసేపటికే అర్ష్ దీప్ (2/13), హర్షిత్ రాణా (2/34), హార్దిక్ పాండ్యా (1/23) పేస్‌కు సఫారీ కుదేలైంది. రిజా హెండ్రిక్స్ (0), డికాక్ (1), బ్రెవిస్ (2)లు పెవిలియన్ చేరడంతో ఒకదశలో 3.1 ఓవర్లలో సఫారీ స్కోరు 7/3. తర్వాత స్పిన్ తిరగడంతో 77 పరుగుల వద్ద 7వ వికెట్‌ను కోల్పోయింది. మార్క్‌రమ్ ఫిఫ్టీతో జట్టు కష్టంగా వంద పైచిలుకు స్కోరు చేసింది.
మెరిపించిన అభిషేక్
భారత్ ముందున్న లక్ష్యం ఏమాత్రం కష్టమైంది కాదు. ఇలాంటి స్కోరు ఛేదించేందుకు దిగిన భారత్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ (18 బంతుల్లో 35; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (28 బంతుల్లో 28; 5 ఫోర్లు) చక్కని ఆరంభమిచ్చారు. అభిషేక్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో టీమిండియా స్కోరు 4.1 ఓవర్ల్లలోనే 50 పరుగులు దాటింది. ఓపెనింగ్ వికెట్‌కు చకచకా 60 పరుగులు జోడించిన అభిషేక్ తొలి వికెట్‌గా నిష్క్రమించాడు.
తిలక్ వర్మ (34 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు), గిల్ కుదురుగా ఆడారు. స్వల్ప వ్యవధిలో గిల్, కెప్టెన్ సూర్యకుమార్ (12) నిష్క్రమించినప్పటికీ మిగతా లాంఛనాన్ని తిలక్, శివమ్ దూబే (10 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ముగించారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్ తదుపరి నాలుగో టి20 బుధవారం (17న) లక్నోలో జరుగుతుంది.
3 స్టబ్స్‌ను అవుట్ చేసిన హార్దిక్ అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో 100 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. ఈ మైలురాయిని అందుకున్న మూడో భారత బౌలర్. అర్ష్ దీప్, బుమ్రాలు ఇదివరకే వంద వికెట్ల క్లబ్‌లో ఉన్నారు.
5 స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పొట్టి క్రికెట్‌లో 50 వికెట్లు పడగొట్టాడు.
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్షిత్ రాణా 1; హెండ్రిక్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అర్ష్ దీప్ 0; మార్క్‌రమ్ (సి) జితేశ్ (బి) అర్ష్ దీప్ 61; బ్రెవిస్ (బి) హర్షిత్ 2; స్టబ్స్ (సి) జితేశ్ (బి) హార్దిక్ 9; బాష్ (బి) దూబే 4; ఫెరీరా (బి) వరుణ్ 20; యాన్సెన్ (బి) వరుణ్ 2; నోర్జే (స్టంప్డ్) జితేశ్ (బి) కుల్దీప్ 12; ఎన్‌గిడి (నాటౌట్) 2; బార్ట్‌మన్ (సి) సూర్యకుమార్ (బి) కుల్దీప్ 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 117. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–7, 4–30, 5–44, 6–69, 7–77, 8–113, 9–115, 10–117. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–13–2, హర్షిత్ 4–0–34–2, హార్దిక్ పాండ్యా 3–0–23–1, వరుణ్ 4–0–11–2, శివమ్ దూబే 3–0–21–1, కుల్దీప్ 2–0–12–2.
భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) మార్క్‌రమ్ (బి) బాష్ 35; శుబ్‌మన్ (బి) యాన్సెన్ 28; తిలక్ వర్మ (నాటౌట్) 26; సూర్యకుమార్ (సి) బార్ట్‌మన్ (బి) ఎన్‌గిడి 12; శివమ్ దూబే (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (15.5 ఓవర్లలో 3 వికెట్లకు) 120. వికెట్ల పతనం: 1–60, 2–92, 3–109. బౌలింగ్: ఎన్‌గిడి 3–0–23–1, యాన్సెన్ 3–0–24–1, బార్ట్‌మన్ 3.5–0–34–0, బాష్ 3–0–18–1, నోర్జే 3–0–14–0.


