నేడు దక్షిణాఫ్రికాతో భారత్ మూడో టి20
ఒత్తిడిలో టీమిండియా
గిల్, సూర్యకుమార్‌లపై అందరి దృష్టి
రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
ధర్మశాల: సొంతగడ్డపై భారత క్రికెట్ జట్టు మరో పోరుకు సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో టీమిండియా మూడో టి20 ఆడనుంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరొకటి గెలవడంతో సిరీస్ 1–1తో సమం కాగా... ఇప్పుడు పైచేయి సాధించేందుకు సూర్యకుమార్ బృందం రెడీ అవుతోంది. తొలి మ్యాచ్‌లో ఓ మాదిరి లక్ష్యాన్ని కాపాడుకున్న టీమిండియా... రెండో టి20లో భారీ లక్ష్యఛేదనలో కనీస ప్రతిఘటన చూపకుండానే పరాజయం పాలైంది.
వచ్చే ఏడాది ఆరంభంలో ఐసీసీ టి20 ప్రపంచకప్ జరగనుండగా... దానికి ముందు భారత జట్టు మరో 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడనుంది. వీటిలో ప్రదర్శన ఆధారంగా వరల్డ్‌కప్‌నకు జట్టును ఎంపిక చేయాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పు, బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు చేర్పులను పరిశీలించుకునేందుకు ఈ మ్యాచ్ ఉపయోగపడనుంది. ముఖ్యంగా టి20 ఫార్మాట్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న శుబ్‌మన్ గిల్‌పై అందరి దృష్టి నిలవనుంది.
ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. వీరిద్దరు రాణించాల్సిన అవసరముంది. మరోవైపు గత మ్యాచ్‌లో విజయం సాధించిన దక్షిణాఫ్రికా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ధర్మశాలలో అడుగుపెట్టనుంది. ఇక్కటి చల్లటి వాతావరణం, పేస్, బౌన్స్‌కు అనుకూలించే పిచ్ సఫారీలకు మరింత సహాయపడనుంది.
గిల్ రాణించేనా..!
టెస్టు, వన్డే ఫార్మాట్‌లలో భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న శుబ్‌మన్ గిల్... టి20ల్లో మాత్రం అదే జోరు కనబర్చలేకపోతున్నాడు. తొలి బంతి నుంచే దూకుడు కనబర్చాల్సిన ఈ ఫార్మాట్‌లో గిల్ ఆ స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ప్రస్తుతం టి20ల్లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న గిల్ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఇదే తరహా ఆటతీరు కనబరిస్తే... టీమ్ మేనేజ్‌మెంట్‌కు వ్యూహం మార్చాల్సి రావచ్చు.
గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లి ఓపెనర్లుగా బరిలోకి దిగగా... ఈ ఇద్దరి రిటైర్మెంట్ అనంతరం అభిషేక్ శర్మ, సంజూ సామ్సన్ ఎక్కువ మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. అయితే దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా సామ్సన్‌ను బెంచ్‌కు పరిమితం చేసిన మేనేజ్‌మెంట్... గిల్‌కు విరివిగా అవకాశాలు ఇస్తోంది. కానీ వాటిని వినియోగించుకోవడంలో మాత్రం అతడు విఫలమవుతున్నాడు.
గత రెండు మ్యాచ్‌ల్లోనూ గిల్ పేలవంగా వికెట్ పారేసుకున్నాడు. ఇక మూడో స్థానంలో అక్షర్ పటేల్ బ్యాటింగ్‌కు దిగడంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అత్యుత్తమ ఆటగాళ్లను డగౌట్‌లో కూర్చోబెట్టి అక్షర్‌కు బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటో కోచ్ గంభీర్‌కే తెలియాలి. అడపాదడపా షాట్‌లు ఆడటం తప్ప నిలకడగా ఇన్నింగ్స్‌ను నిర్మించలేకపోతున్న అక్షర్ వల్ల ఇతర ఆటగాళ్లు కూడా ఇబ్బంది పడుతున్నారు.
సారథి సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాది ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. అభిషేక్ మెరుపుల మధ్య సూర్య వైఫల్యం బయటకు కనిపించడం లేదు కానీ... అతడు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడి చాన్నాళ్లైంది. తిలక్ వర్మ నిలకడగా రాణిస్తున్నా... అతడికి సహకారం కరువైంది. హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ, శివమ్ దూబే ఇలా స్టార్‌లకు కొదవ లేకపోయినా... వీరంతా సమష్టిగా రాణించాల్సిన అవసరముంది.
గత మ్యాచ్‌లో దూబేను ఎనిమిదో స్థానంలో బరిలోకి దింపడంపై కూడా అనేక విమర్శలు వ్యక్తమయ్యాయి. మరి ఈ నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేస్తారా లేక గంభీర్ తన మొండి పట్టుదలను కొనసాగిస్తాడా చూడాలి. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ప్రభావం చూపలేకపోవడం బౌలింగ్‌లో ప్రధాన సమస్యగా మారింది.
గత మ్యాచ్‌లో అనామక బ్యాటర్ సైతం బుమ్రా బౌలింగ్‌లో భారీ సిక్స్‌లు కొట్టడం అభిమానులకు ఇబ్బంది కలిగించింది. మరోవైపు అర్ష్ దీప్ నియంత్రణ కోల్పోతుండటం జట్టుకు మరింత భారం అవుతోంది. వరుణ్ చక్రవర్తి ఫర్వాలేదనిపిస్తుండగా... కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా చూడాలి.
పటిష్టంగా దక్షిణాఫ్రికా...
సుదీర్ఘ పర్యాటనలో భాగంగా టెస్టు సిరీస్ ‘క్లీన్ స్వీప్’ చేసిన దక్షిణాఫ్రికా... ఆ తర్వాత వన్డే సిరీస్‌లో పరాజయం పాలైంది. ఇప్పుడిక చివరగా జరుగుతున్న టి20 సిరీస్‌లో 1–1తో సమంగా ఉంది. ఈ టూర్‌లో తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న సఫారీలు ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌లో పైచేయి సాధించాలని కృతనిశ్చయంతో ఉన్నారు. గత మ్యాచ్‌లో చక్కటి ఇన్నింగ్స్‌తో డికాక్ తన దమ్మేంటో చూపగా... కెప్టెన్ మార్క్‌రమ్, హెండ్రిక్స్, బ్రేవిస్, మిల్లర్, ఫెరీరా, లిండె, యాన్సెన్‌తో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తోంది.
మెరుగైన ఆరంభం లభిస్తే చాలు... క్రీజులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ భారీ షాట్‌లు ఆడగల సమర్థులే కావడం దక్షిణాఫ్రికా జట్టుకు కలిసి రానుంది. ఇక బౌలింగ్‌లో యాన్సెన్ భారత జట్టుకు సింహస్వప్పంలా మారగా... ఎన్‌గిడి, సిపామ్లా, బార్ట్‌మన్ సమష్టిగా కదంతొక్కుతున్నారు.
పిచ్ పేసర్లకు సహకరించే అవకాశం ఉన్న నేపథ్యంలో... సఫారీ బౌలర్లను ఎదుర్కోవడం భారత జట్టుకు కష్టసాధ్యమైన పనే. అభిషేక్ శర్మ ఆరంభంలోనే చెలరేగి వారి లయను దెబ్బతీయకపోతే... ఆ తర్వాత వచ్చే బ్యాటర్లపై దక్షిణాఫ్రికా బౌలర్లు సులువుగా ఒత్తిడి పెంచగలరు.
పిచ్, వాతావరణం
హిమాలయ పర్వత సానువుల్లో జరగనున్న ఈ మ్యాచ్‌లో చలి తీవ్రత అధికంగా ఉండనుంది. ఇక్కడ జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట చేజింగ్ జట్లు గెలుపొందాయి. మంచు ప్రభావంతో రెండో ఇన్నింగ్స్‌లో బంతిపై బౌలర్లకు పట్టుచిక్కడం కష్టం. పిచ్ పేసర్లకు సహకరించనుంది.
తుది జట్లు (అంచనా)
భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, గిల్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా.
దక్షిణాఫ్రికా: మార్క్‌రమ్ (కెప్టెన్), డికాక్, స్టబ్స్/హెండ్రిక్స్, బ్రేవిస్, మిల్లర్, డొనొవాన్ ఫెరీరా, యాన్సెన్, లిండె, ఎన్‌గిడి, బార్ట్‌మన్, నోర్జే/సిపామ్లా.


