ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో ఇవాళ (డిసెంబర్ 14) జరిగిన మూడో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలర్లు కలిసికట్టుగా విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను భారత్ 117 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని 15.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి మ్యాచ్‌లో భారత్, రెండో టీ20లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే.
పూర్తి వివరాల్లోకి వెళితే.. టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకొని సౌతాఫ్రికాను గడగడలాడించింది. అర్షదీప్ సింగ్ (4-0-13-2), వరుణ్ చక్రవర్తి (4-0-11-2), హర్షిత్ రాణా (4-0-34-2), కుల్దీప్ యాదవ్ (2-0-12-2), హార్దిక్ పాండ్యా (3-0-23-1), శివమ్ దూబే (3-0-21-1) చెలరేగడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. మార్క్రమ్ (61) ఒంటరిపోరాటం చేయడంతో సౌతాఫ్రికా కనీసం మూడంకెల స్కోర్‌నైనా చేయగలిగింది.
మిగతా ఆటగాళ్లలో ఫెరియెరా (20), నోర్జే (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. డికాక్ (1), బ్రెవిస్ (2), స్టబ్స్ (9), కార్బిన్ బాష్ (4), జన్సెన్ (2), బార్ట్‌మన్ (1), ఎంగిడి (2 నాటౌట్) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. హెండ్రిక్స్ ఖాతా కూడా తెరవలేకపోయాడు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనను భారత్ ధాటిగా ప్రారంభించినప్పటికీ.. ఆతర్వాత కాస్త నిదానించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (18 బంతుల్లో 35; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తన సహజ శైలిలో మెరుపులు మెరిపించి ఔటయ్యాక శుభ్‌మన్ గిల్ (28 బంతుల్లో 28; 5 ఫోర్లు), తిలక్ వర్మ (34 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ (11 బంతుల్లో 12; 2 ఫోర్లు) ఆచితూచి ఆడారు.
శివమ్ దూబే (4 బంతుల్లో 10 నాటౌట్; ఫోర్, సిక్స్) వచ్చీ రాగానే బ్యాట్ ఝులిపించడంతో భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, జన్సెన్, బాష్‌కు తలో వికెట్ దక్కింది. నాలుగో టీ20 లక్నో వేదికగా డిసెంబర్ 17న జరుగనుంది.


