టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా టీ20 జట్టులో తరచూ ఇలా జరగడం విమర్శలకు తావిచ్చింది. ఇటీవల సౌతాఫ్రికా (IND vs SA)తో రెండో టీ20లోనూ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను వన్‌డౌన్‌లో పంపడం.. అందుకు తగ్గ మూల్యం చెల్లించడం జరిగాయి.
ఏదో మొక్కుబడిగా చేయను
మరోవైపు.. ఈ మ్యాచ్‌లో తుదిజట్టులో మూడు మార్పులతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 51 పరుగుల తేడాతో గెలిచి.. సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య ఆదివారం నాటి మూడో టీ20కి ధర్మశాల వేదిక. ఈ మ్యాచ్‌కు ముందు సౌతాఫ్రికా హెడ్‌కోచ్ షుక్రి కన్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము కూడా బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేస్తామని.. అయితే, అదేదో మొక్కుబడిగా చేసే పనికాదని పేర్కొన్నాడు.
స్పష్టమైన అవగాహన ఉంది
టీ20 ప్రపంచకప్-2026 ప్రణాళికలకు అనుగుణంగానే తాము ముందుకు సాగుతున్నట్లు కన్రాడ్ వెల్లడించాడు. ఈ మేరకు.. ‘‘ప్రతీ మ్యాచ్‌లోనూ మేము బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చబోము. తప్పక ఆర్డర్‌ను మార్చాలన్న నియమేమీ లేదు. ప్రపంచకప్ జట్టు ఎలా ఉండాలో మాకు స్పష్టమైన అవగాహన ఉంది.
ఇందుకు అనుగుణంగానే ప్లేయర్లను మారుస్తూ ఉన్నాము. టెస్టు సిరీస్ నుంచి కొంతమంది ఆటగాళ్లు ఇక్కడే ఉన్నా.. వారికి అవకాశం రాలేదు. ఈ సిరీస్ తర్వాత SA20 లీగ్ కూడా ఉంది. కాబట్టి అక్కడ కూడా మా వాళ్ల ప్రదర్శనను చూస్తాము. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాము.
ఇక్కడ ఏది వర్కౌట్ అయింది.. ఏది వర్కౌట్ కాలేదు అన్న విషయాలను విశ్లేషిస్తాం. ఏదేమైనా మా ప్రణాళికలు, వ్యూహాలకు అనుగుణంగా మాకేం కావాలో పూర్తి స్పష్టతతోనే ఉన్నాము’’ అని షుక్రి కన్రాడ్ చెప్పుకొచ్చాడు. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు సౌతాఫ్రికా క్రికెట్ జట్టు భారత పర్యటనకు వచ్చింది.
1-1తో సమం
ఇందులో భాగంగా తొలుత టెస్టులు జరుగగా.. 2-0తో సఫారీలు టీమిండియాను వైట్‌వాష్ చేశారు. అనంతరం.. వన్డే సిరీస్‌లో భారత్.. సౌతాఫ్రికాను 2-1తో ఓడించి సిరీస్ గెలిచింది. ఇక కటక్ వేదికగా తొలి టీ20లో టీమిండియా 101 పరుగులతో జయభేరి మోగించగా.. ముల్లన్‌పూర్‌లో ప్రొటిస్ జట్టు 51 పరుగుల తేడాతో గెలిచింది.
ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా మూడు మార్పులలతో బరిలోకి దిగింది. ట్రిస్టన్ స్టబ్స్, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్జే స్థానాల్లో రీజా హెండ్రిక్స్, జార్జ్ లిండే, ఓట్నీల్ బార్ట్‌మన్‌లను బరిలోకి దించింది. బార్ట్‌మన్ నాలుగు వికెట్లు కూల్చి సత్తా చాటాడు.
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టీ20లో ఆడిన తుదిజట్లు
భారత్
అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.
సౌతాఫ్రికా
రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, మార్కో యాన్సెన్, లూథో సిపమ్లా, లుంగి ఎంగిడి, ఒట్నీల్ బార్ట్‌మాన్.
చదవండి: భారత్ X పాకిస్తాన్


