ఆర్సీబీ దిగ్గజం కోహ్లితో గ్రీన్ (PC: IPL/BCCI)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలం నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ కామెరాన్ గ్రీన్ తన విషయంలో స్పష్టత ఇచ్చాడు. ఈసారి క్యాష్ రిచ్ లీగ్‌లో తాను బౌలింగ్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. తన మేనేజర్ తప్పిదం వల్లే రిజిస్ట్రేషన్ విషయంలో తప్పు జరిగి ఉండవచ్చని పేర్కొన్నాడు.
110 మంది విదేశీ ప్లేయర్లు
అబుదాబి వేదికగా డిసెంబరు 16 (మంగళవారం)న మినీ వేలం జరుగనున్న విషయం తెలిసిందే. మొత్తంగా ఖాళీగా ఉన్న 77 స్థానాల కోసం 350 మంది క్రికెటర్లు బరిలో నిలిచారు. ఇందులో 240 మంది భారత క్రికెటర్లు ఉండగా.. 110 మంది విదేశీ ప్లేయర్లు ఇందులో ఉన్నారు.
అయితే, ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ (Cameron Green) ఈసారి పూర్తిస్థాయి బ్యాటర్ స్లాట్‌లో తన పేరును నమోదు చేసుకోవడం చర్చనీయాంశమైంది. రూ. 2 కోట్ల కనీస ధరతో ప్యూర్ బ్యాటర్ స్లాట్‌లో సెట్ 1లోనే అతడు వేలంలోకి రానున్నాడు. దీంతో గ్రీన్ ఈ సీజన్‌లో బౌలింగ్ చేయడేమోనన్న సందేహాలు నెలకొన్నాయి. ఇది అతడి ధరపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది.
మా మేనేజర్ తప్పు వల్లే ఇలా..
ఈ నేపథ్యంలో కామెరాన్ గ్రీన్ తన పేరు బ్యాటర్‌గా మాత్రమే నమోదు కావడంపై స్పందించాడు. యాషెస్ సిరీస్ (Ashes Series)లో భాగంగా అడిలైడ్లో మూడో టెస్టుకు ముందు రిపోర్టర్లతో మాట్లాడుతూ.. ‘‘నేను బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. నన్ను బ్యాటర్‌గా మాత్రమే రిజిస్టర్ చేశారన్న విషయం మా మేనేజర్‌కు తెలిసే ఉండదు.
పొరపాటున అతడు తప్పుడు ఆప్షన్ ఎంపిక చేసి ఉంటాడు. ఇదెలా జరిగిందో తెలియదు’’ అని గ్రీన్ చెప్పుకొచ్చాడు. కాగా 2023లో రూ. 17.50 కోట్ల ధరతో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన గ్రీన్.. ముంబై ఇండియన్స్ తరఫున 452 పరుగులు చేయడంతో పాటు ఆరు వికెట్లు తీసి సత్తా చాటాడు.
గ్రీన్‌పై భారీ అంచనాలు
ఈ క్రమంలో 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ పేస్ ఆల్‌రౌండర్‌ను ట్రేడ్ చేసుకోగా.. 255 రన్స్ రాబట్టడంతో పాటు.. 10 వికెట్లు కూల్చాడు. అయితే, 2025లో గ్రీన్ గాయపడటంతో ఈ సీజన్‌లో ఆడలేకపోయాడు. ఈసారి మాత్రం ప్రస్తుత ఫామ్ దృష్ట్యా అత్యధిక ధరకు అమ్ముడుపోయే ఆటగాళ్లలో ఒకడిగా గ్రీన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.


