ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ జరగని ఓ అద్భుతం జరిగింది. ఓ విదేశీ ఆటగాడు భారతీయ ఆటగాడి కోటాలో వేలంలోకి ప్రవేశించాడు. భారత్‌లో (ఢిల్లీలో) పుట్టి, ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్‌లో భాగంగా ఉన్న 29 ఏళ్ల నిఖిల్ చౌదరి 2026 సీజన్ వేలంలోకి చివరి నిమిషంలో భారత ఆటగాడి కోటాలో ఎంట్రీ ఇచ్చాడు.
ఆస్ట్రేలియాలో టాస్మానియా తరఫున పూర్తి స్థాయి ఫస్ట్‌క్లాస్ ఆడుతూ, బిగ్‌బాష్ లీగ్‌లో హోబార్ట్ హరికేన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఖిల్.. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ తరఫున దేశీయ ఆటగాడిగా వేలం బరిలో నిలిచాడు. ఊహించని ఈ పరిణామం ఐపీఎల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇలాంటి ఉదంతాలు ఎప్పుడూ చోటు చేసుకోలేదు.
ఓ ఆటగాడు విదేశీ లీగ్‌ల్లో ఆడుతూ, ఐపీఎల్‌లో దేశీయ ఆటగాడిగా వేలం బరిలో నిలవడం ఇదే మొదటిసారి. లెగ్ స్పిన్ ఆల్‌రౌండర్ అయిన నిఖిల్ వేలంలో సెట్ 35లో (ఆల్‌రౌండర్లు) షార్ట్‌లిస్ట్ అయ్యాడు. షార్ట్‌లిస్ట్ అయిన 350 మంది ఆటగాళ్ల జాబితాలో నిఖిల్ పేరు ప్రత్యేకంగా నిలిచింది.
టీమిండియాకు ఆడాలన్నదే అతని కల, కానీ..!
నిఖిల్‌కు చిన్నప్పటి నుంచి టీమిండియాకు ఆడాలన్నదే కల. ఢిల్లీలో పుట్టి పెరిగిన అతను.. శుభ్‌మన్ గిల్‌తో కలిసి పంజాబ్ జట్టుకు ఆడాడు. అయితే COVID-19 సమయంలో నిఖిల్ పర్యాటకుడిగా వెళ్లి ఆస్ట్రేలియాలో చిక్కుకుపోయాడు.
దీంతో అతని కెరీర్‌కు పుల్‌స్టాప్ పడిందని అంతా అనుకున్నారు. అయితే నిఖిల్ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడాలనుకున్న తన కలను సజీవంగానే ఉంచుకున్నాడు. అందులో భాగంగా అతను ఆస్ట్రేలియా తరఫున తన కొత్త జర్నీని స్టార్ట్ చేశాడు.
నిరంతర సాధన చేస్తూ 2023–24 సీజన్‌లో హోబార్ట్ హరికేన్స్ తరఫున బిగ్ బాష్ లీగ్ ఆడే అవకాశం దక్కించుకున్న నిఖిల్.. తొలి సీజన్‌లోనే ఆకట్టుకున్నాడు. ఫలితంగా అతనికి ఈ ఏడాదే టాస్మానియా తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడే అవకాశం కూడా దక్కింది.
అరంగేట్రం మ్యాచ్‌లోనే నిఖిల్ చెలరేగిపోయాడు. ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. గత నెలలో బ్యాటర్‌గానూ సత్తా చాటి, న్యూ సౌత్ వేల్స్‌పై శతకంతో విరుచుకుపడ్డాడు.


