ఉప్పల్ స్టేడియంలో కిక్కిరిసిన అభిమానులు, స్టేడియంలో ప్రేక్షకులకు మెస్సీ అభివాదం.. చిత్రంలో సీఎం రేవంత్‌రెడ్డి
మెస్సీ, సీఎం ఫ్రెండ్లీ మ్యాచ్ దిగ్విజయం
ఫుట్‌బాల్ ఆటతో అలరించిన ద్వయం
ప్రేక్షకుల ఉత్సాహంతో ఆద్యంతం కోలాహలం
అభిమానుల కేరింతలతో హోరెత్తిన స్టేడియం
సాక్షి, సిటీబ్యూరో: మహా నగరం మెస్సీ మంత్రం జపించింది. గజగజ వణికే చలిలో వేడి రగిల్చింది. దిగ్గజ ఫుట్‌బాల్ క్రీడాకారుడి నామ జపంతో ఉప్పల్ స్టేడియం ఉర్రూతలూగింది. గోట్ పర్యటనలో భాగంగా శనివారం హైదరాబాద్‌కు వచ్చిన మెస్సీకి శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా తాజ్ ఫలక్‌నుమా వెళ్లారు. అక్కడ వందమందితో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొన్నా రు.
అనంతరం ఆయన ఉప్పల్ స్టేడియానికి వచ్చారు. అభిమాన క్రీడాకారుణ్ని ఒక్కసారైనా దూరం నుంచైనా చూడాలని అభిమానులు పోటెత్తారు. వేలాది మంది అభిమానుల కోలాహలం మధ్య ఉప్పల్ స్టేడియంలో తన ఆటతో మైమరిపించారు.
స్టాండ్స్‌లోకి కిక్ చేసి
వీవీఐపీలు, ఫుట్‌బాల్ ప్రేమికులు, మెస్సీ అభిమానులు దిగ్గజ క్రీడాకారుణ్ని చూసేందుకు పోటీపడ్డారు. స్టేడియంలో మెస్సీ, సీఎం రేవంత్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆద్యంతం ప్రేక్షకుల కేరింతల మధ్య కోలాహలంగా సాగింది. ఇక అభివాదం చేస్తు న్న సమయంలో ఫుట్‌బాల్‌ను స్టాండ్స్‌లోకి కిక్ చేసి మెస్సీ అభిమానులను అలరించిన తీరు వైరల్‌గా మారింది.
✨𝐀𝐧 𝐔𝐧𝐟𝐨𝐫𝐠𝐞𝐭𝐭𝐚𝐛𝐥𝐞 𝐌𝐨𝐦𝐞𝐧𝐭 ✨
Football's Greatest Of All Time Lionel Messi in Hyderabad. pic.twitter.com/5z5gXCKbG9— Congress (@INCIndia) December 13, 2025

మ్యూజిక్.. మ్యాజిక్..
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గాయకుడు రాహుల్ సిప్లీగంజ్, గాయని మంగ్లీ మ్యూజిక్ ఆకట్టుకుంది. ఆస్కార్ పాట నాటు.. నాటు పాట పాడుతూ సిప్లీగంజ్ అభిమానులను ఉర్రూతలూగించారు. మెస్సీతో పాటు వేలాది మంది అభిమానులు స్టేడియంలో ఈ పాటకు ఊగిపోయారు. ఎన్నడూ లేనివిధంగా స్టేడియంలో లైట్లు, లేజర్ షో ఏర్పాటు చేశారు. ఈ షో ఆదంత్యం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. దీనికి తోడు ఫోక్ సాంగ్స్‌తో మంగ్లీ మెస్మరైజింగ్ షో అదరగొట్టింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సినీతారలు సైతం స్టేడియంలో సందడి చేశారు.

ఫలించిన పోలీసుల వ్యూహం..
ఉప్పల్: అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీ రాక సందర్శంగా శనివారం మధ్యాహ్నం నుంచే ఉప్పల్ స్టేడియం దారులన్నీ జనసంద్రాన్ని తలపించాయి. టికెట్, పాస్‌లున్న వారిని స్డేడియంలోనికి మూడు గంటలు ముందుగానే అనుమతించడంతో పొలీసులు వ్యూహం ఫలించింది. మ్యాచ్‌ను తిలకించడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల నుంచి అభిమానులు అధిక సంఖ్యలో వచ్చినట్లు సమాచారం. 
మ్యాచ్‌ను వీక్షించేందుకు వస్తున్న యువత
కాగా.. గతంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను సమర్థంగా నిర్వహించిన రాచకొండ పోలీసులు అంతకన్నా ఎక్కువ శ్రద్ధతో చేపట్టిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ తదితర వ్యూహాలు ఫలించాయి. ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకపోవడం విశేషం. రాచకొండ సీపీ సుదీర్ బాబు పిలుపు మేరకు అభిమానులు క్రమశిక్షణతోనే మెలిగారు. పాసులు లేనివారు స్టేడియం వైపు రాకపోవడం గమనార్హం. స్టేడియంలోకి అభిమానులంతా దాదాపుగా మెస్సీ టీ షర్ట్‌ను ధరించి వెళ్లడం కనిపించింది.


