వారి హక్కులను హరించే హక్కు ఎవరికీ లేదు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సమయ పాలన లేకుండా విధులు నిర్వహిస్తున్నారని, వారి పరిరక్షణకు చట్టాలు రావాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. వేతనాలు ఘనంగా ఉన్నా వారి వ్యక్తిగత జీవితం విరుద్ధంగా ఉంటోందని చెప్పింది. దేశ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చిన ఇలాంటి రంగం గురించి పాలకులు ఆలోచించాలని సూచించింది.
ఆ ఉద్యోగుల హక్కులు హరించే అధికారం ఎవరికీ లేదని ఓ కేసు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. అగ్రిమెంట్‌ను పాటించకుండా రాజీనామా చేస్తున్నందుకు రూ.5.9 లక్షల పరిహారం చెల్లించాలని కంపెనీ డిమాండ్ చేయడంపై ఫిర్యాదు చేసినా.. లేబర్ డిపార్ట్‌మెంట్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రాజేశ్ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం విచారణ చేపట్టి.. తాజాగా తీర్పు వెలువరించింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల సామాజిక భద్రతపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. కాంట్రాక్ట్ చట్టంలోని సెక్షన్ 27 ప్రకారం ఒక వ్యక్తిని చట్టబద్ధమైన వృత్తి, వాణిజ్యం, వ్యాపారం చేపట్టకుండా ఆపే ఒప్పందాలు చెల్లుబాటు కావన్నారు. ఈ కేసులో కంపెనీ ఏ ప్రాతిపదికన పరిహారం నిర్ణయించిందో తేల్చాలని కార్మీకశాఖను ఆదేశించారు. పిటిషనర్ రాజీనామాను ఆమోదించాలంటూ కంపెనీకి తేల్చిచెప్పారు.


