అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త తలనొప్పులు
రివ్యూ కమిటీకి తెలిసే జరిగాయంటూ వాంగ్మూలం
‘ఆ అధికారులకు’ నోటీసుల జారీపై మీనమేషాలు
రెండో రోజు విచారణలో పలు కీలక పరిణామాలు
సాక్షి, హైదరాబాద్: ఎస్‌ఐబీ కేంద్రంగా గత ప్ర భుత్వ హయాంలో జరిగిన అక్రమ ఫోన్ ట్యా పింగ్ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న ఆ విభాగం మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావును సిట్ అధికారులు రెండో రోజైన శనివారమూ విచారించారు. ఈ నేపథ్యంలో ఆయన గతంలో న్యాయస్థానంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలే చెప్పినట్లు తెలిసింది. దీంతో ప్రస్తుతం దర్యాప్తు అధికారులకు మరో తలనొప్పి వచ్చిపడింది. దీని ఆధారంగా ముందుకు వెళ్తారా? లేక మిన్నకుండిపోతారా? అనేది తేలాల్సి ఉంది.
విభాగాధిపతుల పర్యవేక్షణలోనే..
విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఈ ట్యాపింగ్ వ్యవహారంలో తాను కేవలం కీలక పాత్రధారిని మాత్రమే అని, ట్యాపింగ్ వ్యవహారం మొత్తం అప్పట్లో డీజీపీలుగా, నిఘా విభాగాధిపతులుగా పనిచేసిన అదనపు డీజీపీ పర్యవేక్షణలో జరిగినట్లు ప్ర భాకర్‌రావు చెప్తున్నారు. పోలీసులు సేకరించిన ఆ«ధారాల ప్రకారం ఈ అక్రమ ఫోన్ ట్యా పింగ్ వ్యవహారం మొత్తం ప్ర భాకర్‌రావు అ«దీనంలోనే జరిగింది. ఇప్పటివరకు అరెస్టు అయిన డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు, అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న, మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావులు సైతం ఇదే విషయాన్ని తమ వాంగ్మూలాల్లో స్పష్టం చేశారు.
ఎస్‌ఐబీకి ఓఎస్డీ హోదాలో ప్రభాకర్‌రావే నేతృత్వం వహించినప్పటికీ... ఈ విభాగం కూడా ప్రధాన ఇంటెలిజెన్స్‌లో అంతర్భాగమే. దీనికి అదనపు డీజీపీ లేదా ఐజీ స్థాయి అధికారులు బాస్‌లుగా ఉంటారు. మరోపక్క ఎస్‌ఐబీలో ప్రణీత్‌రావు వార్‌రూమ్‌గా వినియోగించిన రెండు గదులూ ఇంటెలిజెన్స్ చీఫ్ కోసం అధికారికంగా కేటాయించినవే. ఎలాంటి నిఘా ఉపకరణాలు ఖరీదు చేయాలన్నా కచ్చితంగా నిఘా విభాగాధిపతితో పాటు డీజీపీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. ఇవన్నీ నిబంధనల్లో పొందుపరిచిన అంశాలే. అనుమానిత నంబర్ల ట్యాపింగ్‌కు రూపొందించిన లేఖపై హోంశాఖ కార్యదర్శి సంతకం చేస్తారు.
ఇది ఎస్‌ఐబీ నుంచి నిఘా విభాగాధిపతి, డీజీపీల ద్వారా హోం సెక్రటరీకి చేరుతుంది. ఆయన అందుబాటులో లేనప్పుడు మాత్రమే అత్యవసరమైతే ఎస్‌ఐబీ చీఫ్ లేఖ పంపిస్తారు. అయితే ఇలా జరిగిన మూడు రోజుల్లో హోం సెక్రటరీ నుంచి అను మతి తీసుకోవాలి. ఇలా ట్యాప్ చేస్తున్న నంబర్ల పూర్వాపరాలను డీజీపీతో పాటు చీఫ్ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీ, లా సెక్రటరీలతో కూడిన కమిటీ రివ్యూ చేస్తుంది. ఈ విషయాలను ప్రభాకర్‌రావు తన వాంగ్మూలంలో స్పష్టం చేస్తున్నారని తెలిసింది.
గతంలో ఆయన నాంపల్లి కోర్టులో న్యాయవాదుల ద్వారా దాఖలు చేసిన అఫిడవిట్‌లోనూ ఆయా సెక్రటరీలు, డీజీపీ, అదనపు డీజీల వ్యవహారం ప్రస్తావించారు. తాను పూర్తిగా వారి పర్యవేక్షణలోనే పనిచేశానంటూ ప్రభాకర్‌రావు చెప్పడంతో పరోక్షంగా వారి పాత్రనూ ఆయన ఉటంకిస్తున్నారు. కస్టడీలో చెప్తున్న విషయాలే కాకుండా న్యాయస్థానంలో దాఖలైన అఫిడవిట్‌ను ప్రభాకర్‌రావు వాంగ్మూలంగా పరిగణించాల్సి వస్తుంది.
సుప్రీంకోర్టుకు నివేదిక ఏమిస్తారు?
ప్రభాకర్‌రావు వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుంటే మాజీ డీజీపీలు, నిఘా విభాగం అధిపతుల్నీ విచారించడంతో పాటు అవసరమైతే వారినీ నిందితులుగా చేర్చాలి. ఓ నేరం చేసిన వ్యక్తి మాత్రమే కాదు.. దానికి సహకరించిన వాళ్లు కూడా నిందితులే అవుతారు. ఈ విషయాన్నే చట్టం కూడా స్పష్టం చేస్తోంది.
ప్రభాకర్‌రావు విచారణపై ఈ నెల 19న సిట్ అధికారులు సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉంది. అందులో ఈ అంశాలు ప్రస్తావిస్తారా? ఆయా అధికారుల విషయంలో ఎలా ముందుకు వెళ్తారు? అనేది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.


