ముందుగా వాట్సాప్ స్టేటస్‌లో వీడియో
కుటుంబ కలహాలతో భర్త అఘాయిత్యం
గణపురం: కుటుంబ కలహాలతో ఒక వ్యక్తి భార్యకు ఉరివేసి.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. గణపురం ఎస్‌ఐ రేఖ అశోక్ కథనం ప్రకారం.. సీతారాంపురం గ్రామానికి చెందిన రామాచారి (55)కి గతంలో జరిగిన రెండు పెళ్లిళ్లలో ఒక భార్య చనిపోగా, మరొకరికి విడాకులిచ్చాడు. మైలారం గ్రామానికి చెందిన సంధ్యను 20 ఏళ్ల క్రితం మూడో వివాహం చేసుకున్నాడు. వీరి కుమార్తె వైష్ణవి (19) గణపురం మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడిని కులాంతర వివాహం చేసుకుంది.
ఈ వివాహానికి సహకరించావంటూ భార్య సంధ్యతో రామాచారి తరచూ గొడవ పడుతున్నాడు. దీంతోపాటు రామాచారికి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన రామాచారి శనివారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న భార్యకు తాడుతో ఉరివేసి హత్య చేశాడు. అనంతరం ఫోన్‌లో రికార్డు చేసి స్టేటస్‌గా పెట్టుకుని.. తనూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇది చూసిన సంధ్య కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులతో కలసి రామాచారి ఇంటికి వెళ్లి చూడగా సంధ్య, రామాచారిలు మృతి చెంది ఉన్నారని ఎస్‌ఐ తెలిపారు. మృతురాలి తల్లి సెగ్గోజు భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.


