సమాజ్‌వాదీ పార్టీ అధినేతఅఖిలేశ్ యాదవ్
కూటమి పక్షాన అన్ని పార్టీలను కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేస్తాం
ఓట్లు తొలగించడం ఈసీ బాధ్యత కాదు
యూపీలో బీజేపీ పాగా వేసేందుకే ప్రత్యేక ఓటరు సవరణ
ఏఐని దుర్వినియోగం చేయడం మంచిది కాదు
విజన్ ఇండియా చర్చాగోష్టికి హాజరైన సమాజ్‌వాదీ పార్టీ అధినేత
సాక్షి, హైదరాబాద్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశించిన మేరకు రాకపోయినప్పటికీ దేశంలో ప్రతిపక్ష పార్టీల ఐక్యతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఇండియా కూటమి కొనసాగుతుందని, కూటమి పక్షాన అన్ని పార్టీలను కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. విజన్ ఇండియా చర్చాగోష్టిలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఆయన శనివారం తాజ్‌కృష్ణ హోటల్‌లో విలేకరులతో మాట్లాడుతూ, బీజేపీ దేశంలో విభజన రాజకీయాలకు పాల్పడుతోందన్నారు.
దేశంలో రాజ్యాంగ వ్యవస్థలకు ముప్పు ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో పాగా వేయాలన్న ఏకైక ఆకాంక్షతో ప్రత్యేక ఓటరు సవరణ (ఎస్‌ఐఆర్)ను ఉపయోగించుకోవాలని బీజేపీ ప్రయతి్నస్తోందని ఆరోపించారు. యూపీలో ఉన్న 25 కోట్ల ఓట్లలో మూడు కోట్లను తొలగించాలని చూస్తోందని, ఆ పార్టీ ఎక్కువగా ఓడిపోయే స్థానాల్లోనే ఈ ఓటర్ల తొలగింపు జరుగుతోందని ఆరోపించారు. గతంలో ఎప్పుడూ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనని కంపెనీకి ఓటర్ల తొలగింపు కోసం ఉద్దేశించిన మ్యాపింగ్ యాప్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారని విమర్శించారు.
బూత్‌స్థాయి అధికారులకు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని, వారి చేతిలో సాంకేతికత కూడా లేదని చెప్పారు. ఎన్నికల కమిషన్ కూడా తన బాధ్యతలను సరిగా నిర్వర్తించడం లేదని, ఈసీ అంటే ఓట్లు తొలగించడం కాదని, అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించడమని అన్నారు. ఓటరు కార్డులు నకిలీవి తయారు చేయడానికి వీల్లేకుండా పటిష్ట కార్డులు అమల్లోకి తీసుకురావాలని కోరారు. తెలంగాణలో ఉన్న పార్టీల్లో బీఆర్‌ఎస్ తమకు పాత మిత్రుడని చెప్పారు.
భవిష్యత్తులో ఏఐ మంత్రిత్వ శాఖ
అంతకుముందు విజన్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఏఐ సమ్మిట్ (చర్చాగోష్టి)లో అఖిలేశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాజీవనంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. అందరికీ మంచి చేసేదే నిజమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పారు. ఏఐని దుర్వినియోగం చేయడం మంచిది కాదని, అది సమాజంపై దుష్ప్రభావాన్ని చూపుతుందని అన్నారు.
సైబర్ నేరాలు, పాస్‌వర్డ్‌ల చోరీ తదితర అక్రమాలన్నీ ఏఐతోనే సాధ్యమవుతాయని, ఈ ఏఐని సమగ్రాభివృద్ధి కోసం వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అఖిలేశ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటయినా ఆశ్చర్యం లేదని అఖిలేశ్ అభిప్రాయపడ్డారు. ఏఐని ఉపయోగించి వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని ఆయన పేర్కొన్నారు.


