తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం
ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్
3,911 సర్పంచ్ పదవులకు పోటీలో 12,782 మంది అభ్యర్థులు
29,917 వార్డులకు బరిలో నిలిచిన 71,071 మంది అభ్యర్థులు
ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8,307 వార్డులు ఏకగ్రీవం
ఓటింగ్ పూర్తయ్యాక కౌంటింగ్.. విజేతల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. 3,911 సర్పంచ్ పదవుల కోసం 12,782 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 29,917 వార్డుసభ్య స్థానాలకు 71,071 మంది (నామినేషన్లు దాఖలు కాని, ఏకగ్రీవమైన స్థానాలు మినహాయించి) పోటీపడుతున్నారు.
అదేరోజు ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటుంది. ఏదైనా కారణం వల్ల వాయిదా పడితే మర్నాడు ఆ ఎన్నికను చేపడతారు. రెండో విడతకు సంబంధించి 5 చోట్ల సర్పంచ్ స్థానాలతోపాటు 108 వార్డులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో అక్కడ ఎన్నికలు రద్దయ్యాయి.
అలాగే రెండు సర్పంచ్ స్థానాలు, 18 వార్డు ఎన్నికలపై కోర్టులో స్టే ఉండటంతో అక్కడ కూడా ఎన్నికలు జరగట్లేదు. 415 సర్పంచ్ పదవులు, 8,307 వార్డులు ఏకగ్రీవమైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ఇప్పటికే ప్రకటించింది. సర్పంచ్ అభ్యర్థులకు 30, వార్డు సభ్యులకు 20 గుర్తులు కేటాయించారు.
పోలింగ్ ముగియగానే ఏజెంట్ల సమక్షంలో బాక్సులను సీల్ వేసి మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను అధికారులు ప్రకటించనున్నారు. ఎన్నికల నిర్వహణలో ఎక్కడా లోపాలు తలెత్తకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌రాణి కుముదిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఒక్కో సర్పంచ్ స్థానానికి సగటున 3–4 పోటీ
రెండోదశ పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో సర్పంచ్‌పదవికి సగటున ముగ్గురు, నలుగురు బరిలో నిలవగా, వార్డు సభ్యస్థానాలకు సగటున ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్నారు. మరోవైపు రెండోదశ ఎన్నికల వరకు రూ. 2.02 కోట్ల నగదు, రూ. 3.46 కోట్ల విలువైన మద్యం, రూ. 2.28 కోట్ల విలువైన డ్రగ్స్ సహా మొత్తంగా రూ. 8.59 కోట్ల విలువైన మొత్తాన్ని స్వా«దీనం చేసుకున్నట్లు ఎస్‌ఈసీ వెల్లడించింది. మొత్తం 3,675 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి ముందుజాగ్రత్తగా 33,262 మందిని బైండోవర్ చేశామని తెలిపింది.
రెండో విడతలో...
మొత్తం మండలాలు నోటిఫై: 193
గ్రామ పంచాయతీలు నోటిఫై: 4,333
వార్డులు నోటిఫై: 38,350
పోలింగ్ స్టేషన్లు: 38,337
రెండోదశలో ఓటర్ల సంఖ్య: 57,22,665
పురుషులు: 27,96,006
మహిళలు: 29,26,306
ఇతరులు: 153
పోలింగ్ జరగనున్న పంచాయతీలు: 3,911
పోలింగ్ జరిగే వార్డులు: 22,917
సర్పంచ్ అభ్యర్థులు: 12,782
వార్డ్ మెంబర్ అభ్యర్థులు: 71,071
ఆర్వోలు నియామకం: 30,661
పోలింగ్ సిబ్బంది: 93,905
మైక్రో ఆబ్జర్వర్లు: 2,489 (మూడు దశల ఎన్నికలకు)
వెబ్‌కాస్టింగ్ కోసం గుర్తించిన పోలింగ్ స్టేషన్లు: 3,769
బ్యాలెట్ బాక్సులు అందుబాటులో: 46,026


