ఏపీ ప్రతిపాదిత పోలవరం–నల్లమలసాగర్‌ను అడ్డుకోండి
కృష్ణా ట్రిబ్యునల్–2 వెంటనే తీర్పిచ్చేలా ట్రిబ్యునల్‌కు సూచించండి
ఏఐబీపీ కింద మా 7 ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి
కేంద్ర జలశక్తి శాఖకు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి లేఖ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: మైనర్ ఇరిగేషన్ కోటాలో వాడుకోని 45 టీఎంసీల జలాలను పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు తొలిదశ కింద వాడుకుంటామని, ఈ మేరకు ప్రతిపాదనలతో ఇటీవల సమరి్పంచిన సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)కు అనుమతులివ్వాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కృష్ణా ట్రిబ్యునల్–2 నుంచి అవసరమైన అనుమతులు పొందాకే రెండోదశ పనులు చేపడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న అనుమతులను సత్వరమే ఇప్పించాలని మంత్రి ఉత్తమ్ శనివారం కాంతారావుకు లేఖ రాశారు.
ఈ లేఖను నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా ఢిల్లీలో కాంతారావును కలిసి అందజేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌కు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)లోని వివిధ డైరెక్టరేట్ల నుంచి ఫాస్ట్‌ట్రాక్ విధానంలో సత్వర అనుమతులు ఇప్పించాలని లేఖలో ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు.
మైనర్ ఇరిగేషన్‌లో పొదుపు చేసిన 45 టీఎంసీలతోపాటు పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల మళ్లింపుతో అందుబాటులోకి వచ్చిన 45 టీఎంసీలు కలిపి మొత్తం 90 టీఎంసీలను ఈ ప్రాజెక్టుకు కేటాయించామని పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ లేవనెత్తిన సందేహాలను మే 6న నాగర్‌కర్నూల్ సీఈ నివృత్తి చేసినా అనుమతులు రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సమ్మక్క సాగర్ ప్రాజెక్టు డీపీఆర్‌కు సీడబ్ల్యూసీలోని ఇరిగేషన్ ప్లానింగ్ డైరెక్టరేట్ నుంచి రావాల్సిన అనుమతులను సత్వరమే ఇప్పించాలని కోరారు. డైరెక్టరేట్ కోరిన మేరకు అదనపు సమాచారాన్ని ఈ నెల 8న ఈఎన్సీ (జనరల్) వివరంగా పంపించారని తెలియజేశారు. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసి కృష్ణా ట్రిబ్యునల్–2 వెంటనే తీర్పు వెలువరించేలా సూచించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
తీర్పు వస్తే నిర్మాణంలోని తమ ప్రాజెక్టులకు సత్వర అనుమతులు పొందగలమన్నారు. ఏపీ ప్రతిపాదించిన పోలవరం–నల్లమల్లసాగర్ ప్రాజెక్టుకు అనుమతులివ్వొద్దని సీడబ్ల్యూసీ, ఇతర చట్టబద్ధ సంస్థలను ఆదేశించాలని ఉత్తమ్ సూచించారు. ఆ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి ఏపీ గత నెల 21న టెండర్లను నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు.
ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోండి..
ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచకుండా కర్ణాటక ప్రభుత్వాన్ని నిలువరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి ఉత్తమ్ కోరారు. డ్యామ్ ఎత్తును 524.256 మీటర్లకు పెంచేందుకు వీలుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కోసం రూ. 70 వేల కోట్ల వ్యయంతో అనుమతులిచ్చిందని.. ఆల్మట్టి ఎత్తు పెంచితే దిగువన ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రొగ్రామ్ (ఏఐబీపీ) కింద ప్రాణహిత–చేవెళ్ల, సీతారామ–సీతమ్మసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టు, పాలమూరు–రంగారెడ్డి, ముక్తేశ్వర్ ఎత్తిపోతల, మోడికుంటవాగు, చనాకా–కొరాటా ప్రాజెక్టులను చేర్చి కేంద్ర నిధులు మంజూరు చేయాలని కోరారు.
ఇప్పటికే ముక్తేశ్వర్, చనాకా–కొరాటా, మోడికుంటవాగు, సీతారామ ప్రాజెక్టులకు టెక్నో–ఎకనామిక్ వయబిలిటీ అనుమతులను టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ (టీఏసీ) జారీ చేసిందని గుర్తుచేశారు. దీంతో ఏఐబీపీ కింద చేర్చడానికి ఈ ప్రాజెక్టులు అర్హత సాధించాయని పేర్కొన్నారు.


