పంచాయతీ ఎన్నికల్లో నగదు పంచినప్పటికీ ఓడిన అభ్యర్థుల రివర్స్ గేర్
తమ సొమ్ము తిరిగి ఇవ్వాల్సిందేనంటూ ఓటర్ల నుంచి వసూళ్లు
ఓ గ్రామంలో నలుగురు అభ్యర్థులు కలిపి ఒక్కో ఓటుకు రూ. 33 వేలు పంచిన వైనం
పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు పొందేందుకు పల్లెల్లో నగదు పంచిన అభ్యర్థుల్లో ఓటమిపాలైన వారు తిరిగి వసూళ్లకు తెరతీస్తున్నారు. తమను గెలిపిస్తారని డబ్బు పంచామని.. కానీ ఓడగొట్టినందున ఆ సొమ్మును తిరిగి చెల్లించాల్సిందేనని ఓటర్లను డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రెండో దశ పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు నగదు పంపకాల జోరు పెంచారు. ఓ గ్రామంలో నలుగురు అభ్యర్థులు కలిపి ఒక్కో ఓటుకు ఏకంగా రూ. 33 వేల చొప్పున ముట్టజెప్పారు.
రూ. 10 లక్షలు అప్పు తెచ్చి ఖర్చు చేసినా ఓడా.. నా డబ్బిచ్చేయండి
నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఔరవాణి గ్రామంలో ఓడిపోయిన బీఆర్‌ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కల్లూరి బాలరాజు తన భార్యతో కలిసి దేవుడి ఫొటో, పురుగుల మందు డబ్బా పట్టుకొని ఇంటింటికీ తిరిగాడు. తనకు ఓటు వేయనివారు తాను పంచిన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ‘మా డబ్బు తీసుకొని మమ్మల్నే ఓడించారు. అందుకే మేం పంచిన డబ్బు తిరిగి ఇవ్వండి’ అని పట్టుబట్టారు.
మీకే ఓటు వేశామని ఓటర్లు చెప్పగా దేవుడిపై ప్రమాణం చేయాలని కోరారు. తాము పేదవాళ్లమని, రూ. 10 లక్షలు అప్పు తెచ్చి ఎన్నికల్లో ఖర్చు చేసినా గ్రామస్తులు ఓట్లు వేయలేదని బాలరాజు దంపతలు కన్నీటిపర్యంతమయ్యారు. అయితే ఓటర్లు మాత్రం ‘మేము డబ్బు పంచాలని అడగలేదు కదా.. మీరే ఇచ్చారు’ అని బాలరాజును తిరిగి ప్రశ్నించారు.
కాంగ్రెస్ నేతకు బీఆర్‌ఎస్ అభ్యర్థి మద్దతు
కారేపల్లి: ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా బీఆర్‌ఎస్ మద్దతుతో ఈ నెల 17న మూడో విడత ఎన్నికల్లో బరిలోకి దిగనున్న షేక్ గౌసుద్దీన్ పోటీ నుంచి తప్పుకున్నాడు. అంతేకాకుండా పోటీలో ఉన్న కాంగ్రెస్ నేత పోలగాని శ్రీనివాసరావుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటానని లేఖ రాసిచ్చాడు. ఈ లేఖపై గౌసుద్దీన్‌తోపాటు బీఆర్‌ఎస్ కారేపల్లి గ్రామశాఖ పేరిట పలువురి సంతకాలు ఉన్నాయి.
దేశ్‌ముఖిలో ఓటుకు రూ. 33 వేల చొప్పున పంపిణీ
సాక్షి, యాదాద్రి: భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం దేశ్‌ముఖి గ్రామంలో పంచాయతీ బరిలో ఉన్న అభ్యర్థులు భారీగా డబ్బు పంపిణీ చేశారు. ఒక్కో ఓటుకు ఏకంగా రూ. 33 వేలు ముట్టచెబుతున్నట్లు సమాచారం. ఈ గ్రామంలో 1,367 ఓట్లు ఉండగా సర్పంచ్ స్థానానికి ఒకే సామాజిక వర్గానికి చెందిన నలుగురు పోటీ చేస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులు ఒక్కో ఓటుకు రూ. 10 వేల చొప్పున ఇస్తుండగా మూడో అభ్యర్థి రూ. 8 వేలు, నాలుగో అభ్యర్థి రూ. 5 వేల చొప్పున పంచుతున్నారు. ఈ లెక్కన ఒక్కో ఓటరుకు రూ. 33 వేలు ముడుతున్నాయన్నమాట.
వయసు, మెజారిటీ 71
యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం లప్పానాయక్ తండాకు చెందిన ధీరావత్ గాశీరాంనాయక్ తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచాడు. గాశీరాంనాయక్ వయసు 71 ఏళ్లుకాగా సమీప ప్రత్యర్థిపై ఆయనకు లభించిన మెజారిటీ ఓట్లు కూడా 71 కావడం విశేషం.
ఎన్నికల సిబ్బంది ఆకలి కేకలు
జగిత్యాల రూరల్: జగిత్యాల జిల్లాలో ఎన్నికల విధుల కోసం వచి్చన అధికారులు, సిబ్బందికి భోజనం లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు చేరుకున్న 100–150 మంది ఉద్యోగులకు భోజనం లేకపోవడంతో తాము ఎక్కడ భోజనం చేయాలంటూ వాపోయారు. అధికారులపై మండిపడ్డారు.
ఓట్ల రద్దీ..
ఆదివారం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనుండటంతో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ప్రాంతవాసులు స్వగ్రామాలకు పయనమయ్యారు. దీంతో శనివారం సాయంత్రం ఖమ్మం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ ఇలా కిటకిటలాడింది. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఖమ్మం
ఓడిన సర్పంచ్ అభ్యర్థులకు జగ్గారెడ్డి సన్మానం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను సన్మానించడం మామూలే. కానీ ఓడిన సర్పంచ్ అభ్యర్థులకు శాలువాలు కప్పి సన్మానించిన ఘటన సంగారెడ్డిలో శనివారం జరిగింది. తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు 87 మంది పోటీ చేయగా వారిలో 45 మంది గెలిచారు.
ఓటమి పాలైన 42 మంది సర్పంచ్ అభ్యర్థులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శాలువాలతో సన్మానించారు. వారిలో కొండాపూర్ మండల కేంద్ర సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓడిన మస్కు అవినేని నర్సింహారెడ్డిని సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా నియమిస్తున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు.
ఓట్లేయలేదుగా.. నా సొమ్ము తిరిగివ్వండి
వర్గల్ (గజ్వేల్): సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరులో వార్డుసభ్యునిగా ఓడిపోయన అభ్యర్థి ఓటర్ల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్న వీడియో వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డబ్బు పంచినప్పటికీ తనకు ఓట్లు పడలేదనే భావనతో ఓటర్ల నుంచి తిరిగి డబ్బు వసూలు చేసుకున్నాడు. అలా వెనక్కి తీసుకున్న నగదును లెక్కపెట్టుకుంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఓటు కోసం సౌదీ టు మిరుదొడ్డి
మిరుదొడ్డి (దుబ్బాక): పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు విదేశాల నుంచి తరలివచ్చి ఓ వ్యక్తి ఓటు విలువను చాటిచెబుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన ఎల్ముల బాల్‌రాజు నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు కోసం సౌదీ అరేబియాకు వలస వెళ్లాడు. ఆదివారం జరగనున్న రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు సౌదీ నుంచి మిరుదొడ్డికి చేరుకున్నాడు.


