యుద్ధక్షేత్రంలోసదా సన్నద్ధత ముఖ్యం
మీరు భవిష్యత్ నాయకులుగా ఎదగాలి
ఫ్లైట్ కేడెట్ల కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్
సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని, భారత త్రివిధ దళాలు ప్రతినిత్యం అప్రమత్తతతోనే ఉండాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. అప్రమత్తత, యుద్ధసన్నద్ధతే మనల్ని విజయం వైపు తీసుకెళుతుందని, విజయాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలన్నారు. యుద్ధ సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా నష్టం భారీగా ఉంటుందని, త్రివిధ దళాల సమన్వయంతోనే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతామని ఆయన చెప్పారు.
శనివారం దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన ఫ్లైట్ కేడెట్ల కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో 216 బ్యాచ్‌కు చెందిన 29 మంది మహిళా అధికారులతో సహా మొత్తం 244 మంది కేడెట్లు పాల్గొన్నారు. వీరిలో భారత నావికాదళం నుంచి ఎనిమిది మంది అధికారులు, భారత కోస్ట్ గార్డ్ నుంచి ఆరుగురు, వియత్నాం వైమానిక దళం నుంచి ఇద్దరు అధికారులు ఉన్నారు. ఫ్లైట్ కేడెట్ల కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పాల్గొన్నారు.
శిక్షణ పూర్తి చేసిన ఫ్లయింగ్ బ్రాంచ్, నావిగేషన్, గ్రౌండ్ డ్యూటీ శాఖల ఫ్లైట్ క్యాడెట్లకు ‘వింగ్స్’, ‘బ్రెవెట్స్’ప్రదానం చేశారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ట్రోఫీలు బహూకరించారు. భారత వాయుసేనతోపాటు పరేడ్‌లో పాల్గొన్న భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్స్ వియత్నాం సోషలిస్ట్ రిపబ్లిక్ ఫ్లయింగ్ కేడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం యువ అధికారులనుద్దేశించి సీడీఎస్ మాట్లాడారు.
మూడు సూత్రాలు మరవొద్దు..: మూడు మూల సూత్రాలను ఎప్పుడూ మరవొద్దని యువ అధికారులకు సీడీఎస్ అనిల్ చౌహాన్ సూచించారు. ‘మొదటిది.. జీవితమనేది సైకిల్ ప్రయాణం వంటిది. సమతుల్యత ఉంటేనే ప్రయాణం ముందుకు సాగుతుంది. రెండోది.. ప్రమాదకరమైన గర్వాన్ని, నిర్లక్ష్యాన్ని మీ దరిచేరనివ్వద్దు. మూడోది.. నిబంధనలు పాటించడంలో ఒక రాయిలా ఉండాలి’అని పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత సైన్యం సైతం ఎన్నో మార్పులు చేసుకుంటోంది.
ఈ తరుణంలో సర్విస్‌లోకి అడుగుపెట్టబోతున్న మీరు నూతన సవాళ్లకు తగినట్టుగా తయారు కావాలి. సాంకేతికత యుద్ధ క్షేత్రంలో కీలకంగా మారుతున్న తరుణంలో ఏఐ వాడకాన్ని పెంచడంతోపాటు అనేక నూతన సాంకేతికతలను భారత సైన్యానికి జోడిస్తున్నాం’అన్నారు. భారత సైన్యం కీర్తిని మీరు మరింత పెంచుతారని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా ఆకాశ్‌గంగ స్కైడైవింగ్ బృందం, ఎయిర్ వారియర్ డ్రిల్ టీమ్ అద్భుతమైన ప్రదర్శనలతో పాటు, పిలాటస్ పీసీ–7, కిరణ్, చేతక్ విమానాల ఫ్లై–పాస్ట్‌లు..సారంగ్ హెలికాప్టర్ డిస్‌ప్లే బృందం, సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం వైమానిక ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి.


