సాక్షి, నేలకొండపల్లి: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగరంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి దామల నాగరాజు మృతి చెందారు. నామినేషన్ వేసిన అనంతరం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు అతను బ్రెయిన్ డెడ్ తో మృతి చెందాడని నిర్దారించడంతో, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తరలించారు. నాగరాజు కు ఎన్నికల్లో ఉంగరం గుర్తును కేటాయించారు. ఎన్నికల రోజే ఇండిపెండెంట్ అభ్యర్థి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. 3,911 సర్పంచ్ పదవులకు పోటీలో 12,782 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 29,917 వార్డులకు బరిలో 71,071 మంది అభ్యర్థులు నిలుచున్నారు. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8,307 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. రెండోదశ పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో సర్పంచ్ పదవికి సగటున ముగ్గురు, నలుగురు బరిలో నిలవగా, వార్డు సభ్యస్థానాలకు సగటున ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్నారు.
మరోవైపు రెండోదశ ఎన్నికల వరకు రూ. 2.02 కోట్ల నగదు, రూ. 3.46 కోట్ల విలువైన మద్యం, రూ. 2.28 కోట్ల విలువైన డ్రగ్స్ సహా మొత్తంగా రూ. 8.59 కోట్ల విలువైన మొత్తాన్ని స్వా«దీనం చేసుకున్నట్లు ఎస్‌ఈసీ వెల్లడించింది. మొత్తం 3,675 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి ముందుజాగ్రత్తగా 33,262 మందిని బైండోవర్ చేశామని తెలిపింది.


