ఓసీల్లో మహిళా ఆపరేటర్లు
ఆసక్తితో 43 మంది
ఉద్యోగినుల దరఖాస్తు
మెడికల్ టెస్ట్‌లు చేస్తున్న
సింగరేణి యాజమాన్యం
కొత్తగూడెంఅర్బన్: సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో తొలిసారిగా మహిళా ఆపరేటర్లు అడుగుపెట్టనున్నారు. ఆఫీస్ విధులకే పరిమితమైన మహిళలు ఇక నుంచి యంత్రాలతో బొగ్గు తవ్వకాలు చేపట్టడంతోపాటు రవాణా చేయనున్నారు. ఇందుకోసం సంస్థ సీఎండీ బలరాం చొరవ తీసుకున్నారు. జనరల్ అసిస్టెంట్లు, బదిలీ వర్కర్లుగా పని చేస్తున్న మహిళల నుంచి గత సెప్టెంబర్‌లో దరఖాస్తులు ఆహ్వానించగా, ఓసీల్లో పనిచేసేందుకు 43 మంది ముందుకువచ్చారు. ప్రస్తుతం వారికి సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూలు, ప్రధాన ఆస్పత్రిలో మెడికల్ టెస్టులు చేస్తున్నారు. ఆ తర్వాత సిరిసిల్లలోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ సంస్థలో హెవీ గూడ్స్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ విభాగంలో 30 రోజుల శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఖాళీల లభ్యత ఆధారంగా ఈపీ ఆపరేటర్ ట్రైనీ కేటగిరీ–5 డిసిగ్నేషన్‌తో పోస్టింగ్ ఇవ్వనున్నారు.
అనుకూలమైన యంత్రాలు..
ఓసీల్లో డోజర్లు మహిళా ఆపరేటర్లు పనిచేసేందుకు అనువుగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. తక్కువ వైబ్రేషన్ ఉండటంతో సులభంగా ఆపరేట్ చేసేందుకు వీలుగా ఉంటాయి. రోడ్లను లెవలింగ్ చేసేందుకు ఓసీల్లో గ్రేడర్లను, దుమ్ము, ధూళి లేవకుండా వాటర్ ట్యాంకర్లను వినియోగిస్తారు. బరువులు ఎత్తడానికి హైడ్రాలిక్ క్రేన్లను ఉపయోగిస్తారు. 35 నుంచి 60 టన్నుల సామర్థ్యం కలిగిన చిన్న డంపర్లు కూడా ఉన్నాయి. ఆయా యంత్రాల్లో ఆటోమేటిక్ వ్యవస్థ, పవర్ స్టీరింగ్ వంటి సౌకర్యాలు ఉండటంతో మహిళలు సులభంగా పనిచేయవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. మైనింగ్ జోన్లలో సేఫ్టీ రెస్పాన్స్ వాహనాలుగా ఉండే అంబులెన్స్‌లు కూడా మహిళా డ్రైవర్లు నడపవచ్చు. స్టాకర్ రిక్‌లైయిమర్, కన్వేయర్ సిస్టమ్, క్రషర్ ఆపరేటర్ వంటివి జాయ్‌స్టిక్, బటన్‌లతో నడిపే యంత్రాలపై మహిళలు తేలికగా పనిచేయవచ్చని సింగరేణి అధికారులు చెబుతున్నారు.
ఒత్తిడి, శక్తి వినియోగంలేని యంత్రాలతో పని


