బకాయిదారులకు రెడ్‌నోటీస్‌లు
ఖజానా నింపేలా..
● కేఎంసీ పరిధిలో పన్నుల వసూళ్లపై దృష్టి ● వంద శాతం ఆదాయం నమోదుకు కార్యాచరణ ● క్షేత్రస్థాయికి వెళ్లేలా సిబ్బందికి ఆదేశాలు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం ము న్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) పరిధిలో పన్ను బకాయిలు వంద శాతం వసూలు చేసేలా అధికారులు దృష్టి సారించారు. ఆర్థిక సంవత్సరం ముగింపు వరకు వేచి చూడకుండా ముందుగానే పన్నులు వసూలు చేసేందుకు కార్యాచరణ చేపట్టారు. కేఎంసీ ఖజానా ఖాళీ అవుతుండడం, ఇదిలాగే కొనసాగితే ఉద్యోగుల వేతనాలతో పాటు ఇతర ఖర్చులకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్నందున ఆస్తి పన్నుల వసూళ్లలో వేగం పెంచారు. ఇప్పటికే వార్డు ఆఫీసర్లు, బిల్లు కలెక్టర్లకు సహాయకులను ఏర్పాటు చేశారు. వీరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ బకాయిదారులకు రెడ్‌నోటీసులు జారీ చేస్తున్నారు.
కమిషనర్ ఆదేశాలతో..
పన్నుల వసూళ్లలో పురోగతి లేకపోవడంతో నేరుగా కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య రంగంలోకి దిగారు. వసూళ్ల బాధ్యతలో ఉన్న ఉద్యోగులు కార్యాలయాన్ని వదిలిపెట్టి క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని ఆదేశించారు. ఉద్యోగులు ఫీల్డ్‌లో ఉండడమే కాక రోజువారీ వసూళ్లు వివరాలు తెలపాలని స్పష్టం చేయడంతో అటు రెవెన్యూ అధికారులు, ఇటు సిబ్బందిలో కదలిక వచ్చింది.
బకాయిదారుల గుర్తింపు
అధికారులు ప్రస్తుతం పన్నుల వసూళ్లతో పాటు, భారీగా బకాయిలు ఉన్న వారిని గుర్తించడంలో నిమగ్నమయ్యారు. భారీగా బకాయిలు ఉండి, ఏళ్ల తరబడి పన్నులు చెల్లించని వారి జాబితా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు 250 మందిని గుర్తించిన అధికారులు వారిలో 40 మందికి రెడ్‌నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. నోటీసుల జారీ తర్వాత కూడా పన్ను కట్టని వారిపై మున్సిపల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏదిఏమైనా బకాయిదారులపై ఒత్తిడి పెంచి పన్నులు రాబట్టడమే లక్ష్యంగా ఉద్యోగులు కృషి చేస్తున్నారు.
కేఎంసీ ఖజానా అడుగంటడంతో ప్రస్తుతం ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులకు వేతనాలు, పారిశుద్ద్య వాహనాలకు ఇంధన ఖర్చులు మాత్రమే చెల్లిస్తున్నారు. అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు, ఈఎండీలు, ఎఫ్‌ఎస్‌డీ వంటి బిల్లులను చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఇంకొన్ని రోజు లు ఇలాగే గడిస్తే వేతనాలు, పారిశుద్ద్య ఖర్చులకు కూడా నిధులు వెచ్చించలేని పరిస్థితి ఎదురయ్యే ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు పన్ను వసూళ్లే మార్గమని భావించారు. ఈమేరకు కార్యాలయంలో అదనంగా ఉన్న సిబ్బందిని సహాయకులుగా నియమించి వసూళ్లలో వేగం పెంచేలా పర్యవేక్షిస్తున్నారు. ఖాళీగా ఉన్న సిబ్బందితో పాటు పలు విభాగాల్లోని కొందరు కంప్యూటర్ ఆపరేటర్లను సైతం వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లకు సహాయకులుగా నియమించారు. అయితే, ఇందులో కొందరు క్షేత్రస్థాయికి వెళ్లకుండా కార్యాలయంలోనే ఉండేలా ప్రజాప్రతినిధులతో పైరవీలు చేయిస్తున్నట్లు తెలిసింది.


