శ్రీరంగం కామేష్
అతడి పేరు మహ్మద్ సలీం... మారుపేరు సునీల్‌శెట్టి... సొంత దుకాణం నుంచే చోరీలు ప్రారంభించాడు. 52 ఏళ్ల వయస్సున్న ఇతగాడు 34 ఏళ్ల నేర ప్రస్థానంలో 191 చోరీలు చేశాడు... ఇప్పటివరకు 26 సార్లు పోలీసులకు చిక్కి కటకటాల్లోకి వెళ్లాడు... ‘పీడీ’కి దొరక్కుండా జాగ్రత్తపడుతున్న ఇతగాడిని హైదరాబాద్‌లోని బండ్లగూడ పోలీసులు డిసెంబర్ 2న మరోసారి పట్టుకున్నారు. చోరీల ద్వారా వచ్చిన సొమ్మును ఇతగాడు ఉత్తరాదిలో జల్సాలతో పాటు హెలీటూరిజానికి వెచ్చిస్తుంటాడు.
హైదరాబాద్‌లోని ఫతేదర్వాజా సమీపంలో ఉన్న కుమ్మరివాడికి చెందిన సలీం పూర్తి నిరక్షరాస్యుడు. బతుకుతెరువు కోసం తొలినాళ్లల్లో కిరోసిన్ లాంతర్లు తయారు చేసే కర్మాగారంలో పనివాడిగా చేరాడు. ఆపై తన తండ్రి నిర్వహిస్తున్న కిరాణా దుకాణంలోనే పని చేయడం మొదలెట్టాడు. ఇలా తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్న సలీంకు 16వ ఏట ఓ అమ్మాయితో పరిచయమైంది. అక్కడ నుంచి అతడి జీవితం మలుపులు తిరగడం మొదలైంది. ఈ పరిచయం కాస్తా కొన్నాళ్లకు ప్రేమకు దారి తీసింది.
ఆమెతో కలిసి షికార్లు చేయడానికి అవసరమైన ఖర్చుల కోసం చోరుడిగా మారాడు. తొలుత తమ దుకాణంలోనే చిన్న చిన్న చోరీలు చేయడం మొదలెట్టాడు. కొన్నాళ్లు గుట్టుగానే సాగినా, చిరవకు విషయం బయటకు పొక్కేసరికి ఇల్లు వదిలి పారిపోవాల్సి వచ్చింది. దీంతో గత్యంతరం లేక చాదర్‌ఘాట్‌లోని ఓ హోటల్‌లో కార్మికుడిగా చేరాడు.
ఈ పని చేస్తూనే అవకాశం చిక్కినప్పుడల్లా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న చిన్న గృహోపకరణాలు తస్కరించేవాడు. 1991లో ఇతడి 18వ ఏట ఇత్తడి వస్తువుల చోరీ కేసులో తొలిసారిగా చాదర్‌ఘాట్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. జైల్లో పరిచయమైన ‘సీనియర్ల’ వద్ద తాళాలు పగులకొట్టడంతో మెలకువలు నేర్చుకున్నాడు.
ఈ చోరుడు ప్రధానంగా పాతబస్తీలోని ఓ వర్గానికి చెందిన వారి ఇళ్లనే టార్గెట్‌గా చేసుకునేవాడు. అందుకే గడిచిన మూడుసార్లూ బండ్లగూడ పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసుల్లోనే అరెస్టు అయ్యాడు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు సాధారణంగా తెల్లవారుజాము 3 గంటల వరకు మెలకువగానే ఉంటారు. అందుకే ఇతగాడు తెల్లవారుజాము 4 గంటల తర్వాతే రంగంలోకి దిగుతాడు. అప్పటి వరకు నిద్రరాకుండా ఉండేందుకు తన స్మార్ట్‌ఫోన్‌లో లూడో, క్రికెట్ ఆడుతూ టైమ్‌పాస్ చేస్తాడు.
చిన్న టార్చ్‌లైట్, కటింగ్ ప్లేయర్‌తో ఫీల్డ్‌లోకి వచ్చే ఇతగాడు ప్రధానంగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన ఇళ్లనే ఎంచుకుంటాడు. తాళం వేసున్న ఇంటిని టార్గెట్ చేసినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ పగులకొట్టడు. గోడ దూకి సజ్జ ద్వారా ఇంటి పైకి చేరతాడు. అక్కడ నుంచి ఇంట్లోకి చేరే మార్గం వెతుక్కుని ప్రవేశిస్తాడు. ఇతగాడు చోరీ చేసే సమయంలో పెట్రోలింగ్ వాహనాలు ఆ ప్రాంతానికి వచ్చినా ఇంటి తాళం యథాతథంగా ఉండటంతో వారు ఆ ఇంటిపై దృష్టిపెట్టరనే ఉద్దేశంతో ఇలా చేస్తుంటాడు.
టార్గెట్ చేసిన ఇంటి లోపలకు వెళ్లాక అక్కడ దొరికే చెంచాలు తదితరాలతోనే అల్మారాలు పగులకొట్టి సొత్తు స్వాహా చేస్తాడు. ఇతగాడు 1998లో ముగ్గురు సంతానం ఉన్న ఓ వితంతువును వివాహం చేసుకున్నాడు. సునీల్‌శెట్టి ప్రస్తుతం ఏడుగురి పిల్లలకు తండ్రి.
ఈ సొత్తు విక్రయించగా వచ్చిన సొమ్ముతో ముంబై, అజ్మీర్ సహా ఉత్తరాదిలో జల్సాలు చేస్తుంటాడు. సైట్ సీయింగ్‌తో పాటు హెలీకాఫ్టర్‌లో సంచరించే హెలీటూరిజం కోసం భారీగా ఖర్చు చేస్తాడు. సెక్స్‌వర్కర్ల వద్దకు వెళ్ళే అలవాటు ఉన్న సలీం ఓసారి రూ.12 లక్షల చోరీ సొత్తుతో ముంబైలోని ఓ మహిళ వద్దకు వెళ్లాడు. ఇతడు నిద్రపోతున్న సమయంలో ఆ సొత్తు కాజేసిన ఆమె అక్కడ నుంచి ఉడాయించింది.
బాలీవుడ్ నటుడు సునీల్‌శెట్టి అంటే అమితంగా ఇష్టపడే సలీం తన పేరునూ అలానే మార్చుకున్నాడు. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఆ హీరో ఇంటి వద్దకు అనేకసార్లు వెళ్లినా కలవడం సాధ్యం కాలేదు. ఇప్పటి వరకు 191 నేరాలు చేసి 26 సార్లు అరెస్టు అయినా, శిక్షలు పూర్తయ్యే వరకు జైలు నుంచి బయటకు రాని నేపథ్యంలోనే ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగం అనేక సందర్భాల్లో సాధ్యం కాలేదు. పోలీసులకు చిక్కిన ప్రతిసారీ ఐదారు చోరీలు అంగీకరిస్తున్నా, ఇన్నేళ్లల్లో కేవలం రెండుసార్లే ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగం సాధ్యమైంది.


