అర్ధరాత్రి సరిగ్గా 2:17 గంటలకు అర్చనకు టీమ్స్ నోటిఫికేషన్ వచ్చింది. కళ్లు తెరవాలనిపించలేదు. కానీ ఏం నోటిఫికేషన్ వచ్చిందో వెంటనే చెక్ చేయమని మెదడు అరుస్తోంది. మెదడే నెగ్గింది. అర్చన స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసింది. ‘Tomorrow's Deck Updated’’ అని నోటిఫికేషన్ కనిపించింది. నిద్ర ఎగిరిపోయింది.
ఇది కేవలం అర్చన కథ కాదు. ప్రతి నగరంలో, ప్రతి కంపెనీలో వేలాది మంది ప్రొఫెషనల్స్ ఇలా ఫోన్ నోటిఫికేషన్ శబ్దాలకు నిద్రను కోల్పోతున్నారు. చూడ్డానికి ఇది చిన్న డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. కానీ దాని ప్రభావం వృత్తి, వ్యక్తిత్వం, మానసిక ప్రశాంతత... ఇలా అన్నిటిపై పడుతుంది.
ఫోన్ నోటిఫికేషన్లు మన జీవితం మీద చేస్తున్న దాడులు కేవలం శబ్దాల దాడులు కావు. అవి మైక్రో–బ్రెయిన్ హిట్స్. ప్రతి పింగ్ ఒక చిన్న ఒత్తిడి. ప్రతి చిన్న ఒత్తిడి ఒక పెద్ద డిస్టర్బెన్స్. ప్రతి డిస్టర్బెన్స్ చివరకు బర్న్‌ఔట్‌కు దారితీస్తుంది.
సైన చెప్పే అసలు నిజం...
మన మెదడు ఏ పని మీదైనా ఫోకస్ పెట్టగలిగే సమయం సుమారు 8 నుంచి 12 నిమిషాలు మాత్రమే. ఆ సమయంలో దానికి విఘాతం కలిగితే తిరిగి ఫోకస్ రావడానికి 23 నిమిషాలు పడుతుందని బ్రెయిన్ సైంటిస్టులు చెప్తున్నారు.
ఉద్యోగులకు రోజుకు వచ్చే నోటిఫికేషన్ల సంఖ్య: వాట్సప్–120, ఈమెయిల్ అలర్ట్స్–40–100, టీమ్స్ 85–150, కేలండర్ పింగ్స్ 10–20. అంటే రోజుకు సగటున 250–300 విఘాతాలు.
అంటే మీ ఎనిమిది పని గంటల సమయంలో ఐదు గంటలు పూర్తిగా ఫోకస్ లేకుండా వృథా అవుతున్నాయి. అందుకే చాలామంది ప్రొఫెషనల్స్ రోజంతా బిజీగా ఉన్నప్పటికీ రోజు చివర్లో ‘ఏం చేశాను?’ అనిపిస్తుంది. ఇది మీ తప్పు కాదు. ఇది మీ మెదడుపై జరిగిన దాడి.
అలసట కాదు, బ్రెయిన్ డామేజ్
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లో బర్న్‌ఔట్‌ను occupational phenomenon’ జాబితాలో పెట్టింది. వర్క్ ప్లేస్ ఒత్తిడి వల్ల మెదడు ఎగ్జాస్ట్ అవుతోందని అర్థం. బర్న్‌ఔట్‌కు మూడు ప్రాథమిక లక్షణాలున్నాయి.
∙భావోద్వేగ అలసట. అంటే, ఉదయం లేచిన వెంటనే శక్తి లేకపోవడం. ‘ఇవాళ కూడా ఇదేనా...’ అనిపించడం.
∙పనిపట్ల విసుగు. ఎంతో ఇష్టంగా చేసిన పని కూడా ఇప్పుడు చిరాకు తెప్పించడం.
∙పనితీరు పడిపోవడం, సృజనాత్మకత క్షీణించడం. చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడంలో కూడా గందరగోళం.
షాకింగ్ విషయం ఏమిటంటే నోటిఫికేషన్లు ఈ మూడు లక్షణాలను డైరెక్ట్‌గా పెంచుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. స్టాన్‌ఫర్డ్ న్యూరోసైన్స్ ల్యాబ్స్ స్టడీ ప్రకారం నోటిఫికేషన్ల వల్ల పనితీరు 17శాతం పడిపోతుంది.
‘ఒక్క నిమిషం...’తో కెరీర్ డ్యామేజ్
నిరంతర నోటిఫికేషన్లతో ఫోకస్ కోల్పోవడం వల్ల జరిగే నష్టం మూడు దిశల్లో సాగుతుంది.
1. నోటిఫికేషన్లు మీ డీప్ జోన్‌ను విచ్ఛిన్నం చేసి మిమ్మల్ని ఒక రియాక్షన్–మోడ్ ఉద్యోగిగా మార్చేస్తాయి. దీనివల్ల మీరు క్రియేటివ్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ లాంటి డీప్ వర్క్స్ సమర్థంగా చేయలేరు. దాంతో గుర్తింపు, పదోన్నతి, నాయకత్వ స్థానాలకు దూరమవుతారు.
2. ‘ఏం జరిగినా వెంటనే స్పందించాలి’ అనుకోవడం విధేయత కాదు, బర్న్ అవుట్ ప్రారంభదశ. దీనివల్ల భావోద్వేగ క్షీణత జరుగుతుంది.
3. మీరు రోజంతా బిజీగా ఉన్నా ప్రభావం శూన్యం కావడం మీ కెరీర్ గ్రోత్‌కు అత్యంత ప్రమాదకరం. మేనేజర్లు, హెచ్‌ఆర్, ఉన్నతాధికారులు దీన్ని గమనిస్తారు.
ఇది కేవలం మీ తప్పా?
ఇది కేవలం మీ తప్పు కానే కాదు, ఈనాటి వర్క్ ప్లేస్ సమస్య. ఈనాటి ఆఫీసుల్లో మీటింగ్స్ ఎక్కువ, మెసేజింగ్ యాప్స్ ఎక్కువ. డెడ్ లైన్లు నెత్తిమీద కూర్చుంటాయి. అందరూ ‘అర్జెన్సీ అడిక్షన్’లో చిక్కుకు పోయారు.
పరిష్కారాలు...
1. రోజులో కనీసం రెండు గంటలు ‘నో నోటిఫికేషన్ జోన్’. ఆ సమయాన్ని మీ డీప్ వర్క్‌కు ఉపయోగించండి.
2. నోటిఫికేషన్ డైట్ పాటించండి. అంటే, వాట్సప్ గ్రూప్‌లను మ్యూట్ చేయండి. సోషల్ మీడియాను ఆఫ్ చేయండి. ఈమెయిల్స్ రోజుకు మూడుసార్లు మాత్రమే చెక్ చేయండి.
3. ప్రతి 90 నిమిషాల పని తర్వాత ఐదు నిమిషాల బ్రేక్ తీసుకోండి. ఆ సమయంలో కొద్దిగా నడవండి. లేదా నీళ్లు తాగండి. ఇది మీ కాగ్నిటివ్ ఎనర్జీని తిరిగి పెంచుతుంది.
4. మల్టీ టాస్కింగ్ అనేది మెదడుకు విషం లాంటిది. సింగిల్ టాస్క్ ఆక్సిజన్ లాంటిది. అందుకే ఒకసారి ఒకేపని అనే నిబంధన పెట్టుకుని పాటించండి.
-సైకాలజిస్ట్ విశేష్
ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్
సైకాలజిస్ట్ విశేష్
www.psyvisesh.com


