హైహయ వంశంలో కృతవీర్యుడు అనే రాజు ఉండేవాడు. మహిష్మతీపురాన్ని రాజధానిగా చేసుకుని, ప్రజలను సుభిక్షంగా పరిపాలిస్తుండేవాడు. కృతవీర్యుడికి చాలాకాలం వరకు సంతానం కలగలేదు. మహారాణి ఎన్నెన్నో నోములు నోచింది. దానాలు చేసింది. ఏ నోము ఫలమో గాని, కొంతకాలానికి మహారాణి కడుపు పండింది. మగబిడ్డ జన్మించాడు. అయితే, ఆ మగబిడ్డకు చేతులు వైకల్యంతో ఉన్నాయి. శిశువు పరిస్థితి చూసి కృతవీర్యుడి దంపతులు దిగులు చెందారు. అయినా, లేకలేక కలిగిన సంతానం కావడంతో అల్లారు ముద్దుగా పెంచారు. అర్జునుడు అని నామకరణం చేశారు. కృతవీర్యుడి కొడుకు అయినందున కార్తవీర్యార్జునుడిగా పేరుపొందాడు.
కార్తవీర్యార్జునుడికి చేతులు చచ్చుబడి ఉన్నా, శరీరం వజ్రతుల్యంగా ఉండేది. కృతవీర్యుడు కొడుకును గురుకులంలో చేర్పించాడు. గురువుల వద్ద కార్తవీర్యార్జునుడు సకల శాస్త్రాలనూ నేర్చుకున్నాడు. విద్యాభ్యాసం పూర్తయ్యే నాటికి యుక్తవయస్కుడయ్యాడు.
కొడుకును యువరాజుగా పట్టాభిషేకం చేయాలని కృతవీర్యుడి కోరిక. అయితే, అవిటి చేతులవాడైన కొడుకుకు యువరాజుగా పట్టాభిషేకం జరిపిస్తే లోకులు ఏమనుకుంటారోననే సంశయం చెందాడు. సింహాసనంపై కూర్చోబెట్టిన తర్వాత కొడుకు సజావుగా పరిపాలన సాగించలేకపోతే ప్రజల ముందు తలవంపులు తలెత్తవచ్చని బెంగపెట్టుకున్నాడు. కృతవీర్యుడు ఈ బెంగతోనే కొడుకుకు పట్టాభిషేకం చేయకుండానే కన్నుమూశాడు.
రాజ్యంలో అరాచకం తలెత్తకూడదనే ఉద్దేశంతో మంత్రులు, పురోహితులంతా కలసి వెళ్లి పట్టాభిషేకానికి అంగీకరించమని కార్తవీర్యార్జునుడిని కోరారు.
‘మహానుభావులారా! నేను అవిటివాణ్ణి. ప్రజారక్షణ చేయలేను. ప్రజారక్షణ చేయలేనివాడు పట్టాభిషేకం జరిపించుకోవడం తగదు. రాజు రక్షణ కల్పిస్తాడనే ప్రజలు పన్నులు చెల్లిస్తారు. ప్రజల నుంచి పన్నులు తీసుకుని, వారికి ఎలాంటి రక్షణ కల్పించకుండా, సుఖభోగాలు అనుభవించేవాడు రాజు కాదు, చోరుడు అవుతాడు. మీ మాటకు తలవంచి, పట్టాభిషేకం జరిపించుకుని, పాలనా బాధ్యతలను మీపై మోపితే, నేను మీ చేతిలో కీలుబొమ్మనవుతాను. రాజ్యంలో ఇలాంటి పరిస్థితి ఉంటే, ప్రజలు నన్ను ఆడిపోసుకుంటారు. ఇరుగు పొరుగు రాజులు చులకన చేస్తారు. తెలిసి తెలిసి పాపం మూటకట్టుకోలేను. ఇప్పుడు ఈ కిరీటాన్ని మోయలేను’ అన్నాడు కార్తవీర్యార్జునుడు.
మంత్రులు, పురోహితులు ఎంతగా నచ్చజెప్ప చూసినా, పట్టాభిషేకానికి కార్తవీర్యార్జునుడు ససేమిరా అంటూ తిరస్కరించాడు. ‘నేను వెళ్లి తపస్సు చేసి, రాజ్యపాలనకు తగిన అన్ని సామర్థ్యాలను సంపాదించుకుని వస్తాను. అంతవరకు సమర్థులైన మీరంతా పరిపాలన కొనసాగించండి’ అని చెప్పాడు.
పురోహితుల్లో ఒకరైన గర్గముని కార్తవీర్యార్జునుడి నిర్ణయాన్ని ప్రశంసించాడు. ‘రాకుమారా! తపస్సులు ఫలించడం అంత తేలిక కాదు. వేల ఏళ్లు పట్టవచ్చు. నీకొక తేలిక మార్గం చెబుతాను, విను. సహ్యాద్రి లోయల్లో దత్తాత్రేయుడు ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. అతడు సాక్షాత్తు విçష్ణ్వంశ సంభూతుడు. జంభాసురాదులు స్వర్గాన్ని ఆక్రమించినప్పుడు సాక్షాత్తు దేవేంద్రుడంతటి వాడే దత్తాత్రేయుడిని ఆశ్రయించి, కష్టాల నుంచి గట్టెక్కాడు. అందువలన నువ్వు దత్తత్రాయుడిని ఆశ్రయించు. ఆయనను ప్రసన్నం చేసుకో. నీ అభీష్టం నెరవేరగలదు’ అని చెప్పాడు.
గర్గముని సలహాపై కార్తవీర్యార్జునుడు సుముహూర్తం చూసుకుని దత్తుని ఆశ్రయించడం కోసం వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. మంత్రులు, పురోహితులకు రాజ్యాన్ని అప్పగించి, వారి ఆశీస్సులు తీసుకుని సహ్యాద్రి వైపు బయలుదేరాడు. రాజలాంఛనాలన్నీ వదిలేసి, నిరాడంబర వేషంలో వెదుక్కుంటూ వెళ్లి, దత్తాశ్రమానికి చేరుకున్నాడు.
కార్తవీర్యార్జునుడు ఆశ్రమంలోకి అడుగుపెట్టే సరికి దత్తాత్రేయుడు మణిమయ పీఠంపై మధువు సేవిస్తూ, మానినులతో సల్లాపాలాడుతూ ఉన్నాడు.
రాజు రక్షణ కల్పిస్తాడనే ప్రజలు పన్నులు చెల్లిస్తారు. ప్రజల నుంచి పన్నులు తీసుకుని, వారికి ఎలాంటి రక్షణ కల్పించకుండా, సుఖభోగాలు అనుభవించేవాడు రాజు కాదు, చోరుడు అవుతాడు.
గోత్ర నామాలు చెప్పుకుని, కార్తవీర్యార్జునుడు ఆయన ముందు సాష్టాంగపడ్డాడు. దత్తాత్రేయుడు అతడివైపు ఓరచూపు విసిరి, చిరునవ్వు చిందించాడు. స్వామి తనరాక గమనించాడని కార్తవీర్యార్జునుడు కుదుటపడ్డాడు.
దత్తాత్రేయుడిని సేవించుకుంటూ, ఆశ్రమంలోనే గడపసాగాడు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు వైకల్యంగల తన చేతులతోనే దత్తాత్రేయుడు కూర్చున్న పీఠంపై శయ్యను సుఖంగా కూర్చునేందుకు వీలుగా సర్దుతున్నాడు. అదే సమయంలో దత్తాత్రేయుడి నుంచి అపాన వాయువు వెలువడింది. ఆ వాయువు వేడికి వైకల్యంగల కార్తవీర్యార్జునుడి చేతులు మాడిపోయాయి. ఆ బాధకు అతడు కుప్పకూలిపోయాడు.
అది చూసి, ‘అయ్యో! ఎంతపని జరిగింది! కొండనాలుకకు మందు వేస్తే, ఉన్న నాలుక ఊడినట్లయింది కదా’ అన్నాడు దత్తాత్రేయుడు.
‘స్వామీ! ఇలాంటి పరీక్షలు నువ్వు ఎన్ని పెట్టినా, నిన్నే ఆశ్రయించుకుని ఉంటాను’ అన్నాడు కార్తవీర్యార్జునుడు. అతడి భక్తికి దత్తాత్రేయుడు సంతోషించాడు. అతడికి శక్తిసంపన్నమైన సహస్రబాహువులను అనుగ్రహించాడు.
-సాంఖ్యాయన


