
బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) గాయపడ్డారని తెలుస్తోంది. తను నటిస్తున్న కొత్త సినిమా 'కింగ్' షూటింగ్లో ఆయన ప్రమాదానికి గురైనట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ముంబైలోని గోల్డెన్ టొబాకో స్టూడియోలో కింగ్ సినిమా షూటింగ్ జరుగుతుంది. అందులో కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం అతిపెద్ద సెట్ వేశారు. యాక్షన్ సీన్ చిత్రీకరణలో భాగంగానే షారుఖ్ గాయపడ్డారని చెబుతున్నారు.
అయతే, గాయం గురించి ఖచ్చితమైన వివరాలను అధికారికంగా వెళ్లడించలేదు. కానీ, షారుఖ్ తన టీమ్తో కలిసి అత్యవసర వైద్య సహాయం కోసం అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన కండరాలకు తీవ్రంగా గాయం అయినట్లు సమాచారం. అయతే, అభిమానులు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని బాలీవుడ్ మీడియా పేర్కొంది. షారుఖ్ గతంలోనే కండరాల సమస్యతో ఇబ్బంది పడ్డారు. అందుకోసం చికిత్స కూడా తీసుకున్నారు.
2023లో పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో షారుఖ్ ఖాన్ హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నారు. 2024లో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. అయితే, 'కింగ్' సినిమా ప్రకటించి ఆయన మళ్లీ బిజీ అయ్యారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రం రానుంది. గతంలో వారిద్దరూ పఠాన్‌తో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇందులో షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.దీపికా పదుకొణె, రాణి ముఖర్జీ, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.